Hair Growth : అందంగా కనిపించాలంటే కేవలం రూపు రేఖలు మాత్రమే కాదు.. శిరోజాలు కూడా అందంగానే ఉండాలి. జుట్టు అందంగా కనిపించకపోతే.. ఏవిధంగా అందంగా ఉన్నా కూడా వృథాయే అవుతుంది. కనుక అందంలో శిరోజాలు కూడా ముఖ్య పాత్రను పోషిస్తాయి. అయితే కొందరు జుట్టు సమస్యలతో సతమతం అవుతుంటారు. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాను పాటిస్తే ఆయా సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ చిట్కా ఏమిటంటే..
మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మనకు మర్రి చెట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మర్రి చెట్టు అన్ని భాగాలు కూడా మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మర్రి ఊడలతో మనం జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
500 గ్రాముల మేర మర్రి చెట్టు వేళ్లను (ఊడలను) సేకరించి వాటిని చిన్నగా సన్నని ముక్కలుగా చేసి ఎండబెట్టాలి. ముక్కలు బాగా ఎండాక వాటిని చూర్ణం చేయాలి. అలా తయారైన 250 గ్రాముల చూర్ణం తీసుకుని కిలో కొబ్బరినూనెలో కలిపి మళ్లీ రోజూ ఎండలో పెట్టాలి. వారం తర్వాత ఆ మిశ్రమాన్ని వస్త్రంలో వడకట్టి ఒక పాత్రలోకి నూనె మొత్తం దిగేదాకా ఉంచాలి. ఆ నూనెను రోజూ రాత్రి పూట పడుకునేటప్పుడు మాడుకు పట్టించాలి. ఇలా చేస్తుంటే జుట్టు సమస్యలు తగ్గుతాయి.
పైన తెలిపిన విధంగా మర్రి ఊడలతో నూనె తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. పొడవుగా పెరుగుతాయి. జుట్టు నిగనిగలాడుతుంది. చుండ్రు తగ్గుతుంది.
అయితే జుట్టు సమస్యలకు పోషకాలు కలిగిన ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో కాల్షియం, జింక్, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీంతో జుట్టుకు బలం లభిస్తుంది. మరింత సమర్థవంతంగా జుట్టు సమస్యలను త్వరగా తగ్గించుకోవచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.