పెదవులు ఆరోగ్యంగా, అందంగా కనిపించకపోతే చాలా మందికి నచ్చదు. అందుకని పెదవులను అందంగా ఉంచుకునేందుకు వారు రక రకాల కాస్మొటిక్స్ వాడుతుంటారు. అయితే అంత ఖర్చు చేయాల్సిన పనిలేకుండానే సహజసిద్ధమైన పదార్థాలతోనే పెదవులను అందంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేయవచ్చు. అందుకు గాను కింద తెలిపిన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
1. చిన్న గ్లాస్ పాలను తీసుకుని అందులో గులాబీ పువ్వుల రెక్కలను వేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని పెదవులపై రాయాలి. 30 నిమిషాల పాటు ఆగాక కడిగేయాలి. ఇలా రోజుకు ఒక్కసారి చేస్తే వారంలోనే పెదవుల్లో వచ్చే మార్పును గమనిస్తారు.
2. చక్కెరను కొద్దిగా తీసుకుని పొడి చేయాలి. దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అందులో అంతే మోతాదులో తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని పెదవులపై రాయాలి. 30 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే పెదవులపై ఉండే మురికి, దుమ్ము, ధూళి, మృతకణాలు తొలగిపోయి పెదవులు అందంగా కనిపిస్తాయి.
3. రోజూ రాత్రి నిద్రించే ముందు పెదవులపై ఆలివ్ నూనెను మర్దనా చేసినట్లు సున్నితంగా రాయాలి. రాత్రంతా అలాగే ఉంచి మరునాడు ఉదయం కడిగేయాలి. దీంతో పెదవులు మృదువుగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.
4. ఆలుగడ్డలను చిన్న ముక్కలుగా కట్ చేసి వాటితో పెదవులపై మర్దనా చేస్తుండాలి. దీంతో పెదవులు మెత్తబడుతాయి. మృదువుగా మారుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి.
5. కలబంద గుజ్జును కొద్దిగా తీసుకుని పెదవులకు రాయాలి. 30 నిమిషాలు ఆగాక కడిగేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి.
6. టమాటా గుజ్జు, పెరుగులను బాగా కలిపి పెదవులపై రాయాలి. కొంత సేపు ఆగాక కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే పెదవులు మంచి రంగును సొంతం చేసుకుంటాయి.
7. కుంకుమ పువ్వును పొడి చేసి పెరుగులో కలిపి దాన్ని పెదవులపై రాయాలి. 30 నిమిషాలు ఆగాక కడిగేయాలి. వారంలో 3 సార్లు ఇలా చేస్తే పెదవులు అందంగా మారుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి.