Garlic And Honey For Skin : చాలా మంది తమ అందాన్ని పెంచుకోవడం కోసం అనేక రకాల సౌందర్య సాధన ఉత్పత్తులను వాడుతుంటారు. కొందరు బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. ఇంకొందరు ఖరీదైన ట్రీట్స్‌మెంట్స్ పొందుతారు. అయినప్పటికీ ఫలితం ఉండడం లేదని వాపోతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఓ సహజసిద్ధమైన చిట్కాను రోజూ పాటిస్తే చాలు, దీంతో మీ ముఖంలో కాంతి పెరుగుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనెలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అందువల్ల మన చర్మానికి తేనె ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. అలాగే తేనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. దీంతో చర్మం తేమగా ఉండి మృదువుగా మారుతుంది. అలాగే చర్మంలో కాంతి పెరుగుతుంది. ఇక తేనె గాయాలు, పుండ్లను కూడా త్వరగా మానేలా చేస్తుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) చెబుతున్న ప్రకారం తేనె మన చర్మానికి ఎంతో ఉపయోగపడుతుంది.
చర్మానికి ఎంతో మేలు చేసే వెల్లుల్లి..
వెల్లుల్లి కూడా మన చర్మానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో కణాలు రక్షించబడతాయి. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. దీంతో చర్మం తన సహజసిద్ధ రంగును పొందుతుంది. అలాగే వృద్ధాప్య లక్షణాలు కూడా చర్మంపై కనిపించవు. ఇక వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
రెండింటినీ ఇలా తీసుకోవాలి..
కనుక మనం రోజూ వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తీసుకుంటే చర్మానికి ఎంతో మేలు కలుగుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రెండింటినీ ఎలా తీసుకోవాలంటే.. ఒక వెల్లుల్లి తీసుకుని దాన్ని బాగా నలపాలి. అనంతరం దానిపై ఒక టీస్పూన్ తేనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి పూట నిద్రకు ముందు తినాలి. అయితే వెల్లుల్లిని తిన్నాక నోరు వాసన వస్తుందని భావించే వారు వెల్లుల్లిని ముక్కలుగా కట్ చేసి దానిపై తేనె వేసి ఆ మిశ్రమాన్ని మింగేయవచ్చు. తరువాత గోరువెచ్చని నీళ్లను తాగాలి. ఇలా ఈ రెండింటి మిశ్రమాన్ని రోజూ రాత్రి నిద్రకు ముందు తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మీ చర్మంలో వచ్చే మార్పును మీరు గమనించవచ్చు. దీంతో మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఖర్చు పెట్టి వాడే బదులు ఈ చిట్కాను పాటిస్తే సహజసిద్ధంగా అందంగా కనిపించవచ్చు.