Ginger For Beauty : అల్లం.. ఇది మనందరికి తెలిసిందే. వంటల్లో అల్లాన్ని విరివిగా ఉపయోగిస్తూ ఉంటాము. వంటలకు చక్కటి రుచిని తీసుకురావడంలో అల్లం దోహదపడుతుందని చెప్పవచ్చు. అలాగే అల్లంలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా మంది అల్లం టీని, అల్లం రసాన్ని తీసుకుంటూ ఉంటారు. ఏ రూపంలో తీసుకున్నా కూడా అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లాన్ని తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో అల్లం మనకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే కేవలం మన శరీర ఆరోగ్యానికే కాదు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా అల్లం మనకు దోహదపడుతుంది. అల్లాన్ని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
చర్మం యొక్క రంగును మెరుగుపరచడంలో, చర్మ సమస్యలను తగ్గించడంలో అల్లం మనకు ఉపయోగపడుతుంది. ఎటువంటి చర్మతత్వం ఉన్నవారైనా అల్లాన్ని ఉపయోగించవచ్చు. అల్లాన్ని ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మంపై ముడతలను తగ్గించి వృద్దాప్య ఛాయలు దరి చేరకుండా చేయడంలో కూడా అల్లం మనకు సహాయపడుతుంది. అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయి. అల్లాన్ని ఉపయోగించడం వల్ల ఎటువంటి చర్మ సమస్యలు నయం అవుతాయి… అలాగే అల్లాన్ని ఎలా ఉపయోగించాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మంది చర్మంపై ఇన్ ప్లామేషన్ వచ్చి బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు అల్లం ముక్కను తీసుకుని చర్మం ఉబ్బిన చోట నెమ్మదిగా రుద్దాలి. దీనిని అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయడం వల్ల ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. అలాగే కొందరిలో కళ్ల చుట్టూ ఉబ్బినట్టుగా, ఎర్రగా ఉంటుంది. అలాంటి వారు అల్లం టీ బ్యాగ్ లను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. టీ తయారు చేసుకున్న తరువాత ఈ టీ బ్యాగ్ లను పడేయకుండా కళ్లపై ఉంచుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉంచడం వల్ల కళ్ల చుట్టూ ఉండే ఉబ్బుదనం తగ్గిపోతుంది. అలాగే మనలో చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు అల్లాన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అర టీ స్పూన్ అల్లం రసంలో అర టీ స్పూన్ తేనె కలిపి మొటిమలపై రాయాలి. దీనిని అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది. అలాగే చర్మం పై గాయాల తాలూకు మచ్చలు అలాగే ఉండిపోతాయి. ఈ మచ్చలను తొలగించడంలో కూడా అల్లం మనకు ఉపయోగపడుతుంది. అల్లం రసంలో నిమ్మరసం కలిపి గాయాల తాలూకు మచ్చలపై రాయాలి. ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గాయాల మచ్చలు తగ్గిపోతాయి.
ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే నల్ల మచ్చలు కూడా తగ్గిపోతాయి. అలాగే ఒక టీ స్పూన్ అల్లం రసంలో 2 టీ స్పూనల్ పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చర్మం అందంగా కనబడుతుంది. చర్మం యొక్క రంగు కూడా మెరుగుపడుతుంది. చర్మ సమస్యలను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా అల్లం మనకు దోహదపడుతుంది. అయితే అల్లాన్ని ఉపయోగించడం వల్ల కొందరిలో చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. కనుక దీనిని ఉపయోగించే ముందు అల్లంరసాన్ని చర్మంపై రాసుకుని 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఎటువంటి సమస్య లేని తరువాత మాత్రమే అల్లాన్ని ఉపయోగించాలి.