ముఖంపై మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ ఉంటే ఎవరికైనా సరే ఇబ్బందిగానే అనిపిస్తుంది. వాటిని తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. వేపాకులను నీటిలో వేసి చిన్న మంట మీద వేడి చేయాలి. చల్లారిన తరువాత వాటిని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను రోజూ ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ మాయమవుతాయి. ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
2. కొద్దిగా దాల్చిన చెక్క పొడి, కొన్ని చుక్కల నిమ్మరసం, తేనెలను కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలపై లేదా మచ్చలపై లేదా బ్లాక్ హెడ్స్ పై రాయాలి. రెండు గంటల పాటు ఉన్నాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే సమస్యలు తగ్గుతాయి.
3. ముల్తానీమట్టికి రోజ్ వాటర్, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని వారంలో రెండు, మూడు సార్లు ముఖానికి రాసుకోవాలి. గంట సేపయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ మాయమవుతాయి.
4. తులసి ఆకులు, పుదీనా ఆకుల నుంచి రసం తీసి వాటిని నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. గంట పాటు ఉన్నాక కడిగేయాలి. వారంలో మూడు సార్లు ఇలా చేస్తుంటే ఫలితం ఉంటుంది.
5. ఐస్ క్యూబ్స్‌ను తీసుకుని మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ ఉన్న చోట సున్నితంగా మర్దనా చేయాలి. రోజుకు రెండు సార్లు, ఒక్కో విడత 5 నిమిషాల చొప్పున చేస్తుండాలి. దీంతో కూడా మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.