భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నెయ్యిని ఉపయోగిస్తున్నారు. దీన్ని నిత్యం అనేక వంటకాల్లో వాడుతుంటారు. కొందరు నెయ్యిని నేరుగా భోజనంలో తీసుకుంటారు. నెయ్యి వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే నెయ్యితో పలు చర్మ సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు కళ్ల కింద నల్లని వలయాలపై నెయ్యిని సున్నితంగా రాయాలి. తరువాత మరుసటి రోజు ఉదయాన్నే కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే కొద్ది రోజుల్లోనే కళ్ల కింద ఉండే డార్క్ సర్కిల్స్ మాయమవుతాయి.
2. పెదవులు పగిలిపోయి అంద విహీనంగా కనిపిస్తుంటే రాత్రి పూట పెదవులకు కొద్దిగా నెయ్యి రాయాలి. మరుసటి రోజు ఉదయాన్నే కడిగేయాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే పెదవులు అందాన్ని సంతరించుకుంటాయి. మృదువుగా మారుతాయి.
3. స్నానం చేయడానికి ముందు శరీరానికి లేదా ముఖానికి నెయ్యిని రాసుకుని తరువాత స్నానం చేస్తే పొడి చర్మం కాస్తా మృదువుగా మారుతుంది. తేమగా ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్నవారికి ఈ టిప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
4. ముఖం కాంతిలేకుండా కనిపిస్తుంటే కొద్దిగా నెయ్యి తీసుకుని దాన్ని శనగపిండి, పచ్చిపాలతో కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి కొంత సేపు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో కాంతి పెరుగుతుంది.
5. రాత్రి పూట ముఖానికి కొద్దిగా నెయ్యి రాసి మరుసటి రోజు ఉదయాన్నే కడిగేయాలి. దీంతో ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు పోతాయి.
6. ముఖం లేదా శరీరంపై ఎక్కడైనా కాలిన గాయాలు, పుండ్లు ఉంటే ఆయా భాగాల్లో నెయ్యి రాస్తే అవి త్వరగా మానుతాయి.
7. నిత్యం నెయ్యిని ముఖానికి రాయడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉంటాయి. ఇందుకు గాను అర టేబుల్ స్పూన్ నెయ్యిని, అంతే మొత్తంలో తేనెకు కలిపి ముఖానికి రాయాలి. 18-20 నిమిషాల పాటు ఉంచి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ముఖంపై ఏర్పడే ముడతలకు, మచ్చలకు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.