Open Pores On Face : చర్మంపై లేదా ముఖంపై ఓపెన్ పోర్స్ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఓపెన్ పోర్స్ కారణంగా ముఖం చూడడానికి అంత అందంగా కనిపించదు. స్వేద రంధ్రాల్లో ఎక్కువగా విడుదలయ్యే నూనెలను అలాగే వాటిలో చేరిన వ్యర్థాలను చర్మం తనంతట తాను బయటకు పంపిస్తుంది. కానీ మనలో చాలా మంది ఆ వ్యర్థాలను తొలగించడానికి వాటిని గిల్లుతూ ఉంటారు. కొందరు పిన్నిసులతో గుచ్చుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ భాగంలో గుంట పడుతుంది. చర్మం తనంతట తానుగా ఆ వ్యర్థాలను బయటకు పంపిస్తుందని మనం వాటిని గిల్లడం గాని గుచ్చడం కానీ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆ భాగంలో క్రిములు చేరి ఇన్పెక్షన్ కు దారి తీయడంతో పాటు ఆ భాగంలో గుంట పడి ముఖం మరింత అందవిహీనంగా తయారవుతుందని వారు చెబుతున్నారు.
ముఖంపై ఏర్పడిన వ్యర్థాలను చేత్తో పిండడమే పోర్స్ రావడానికి ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. ఓపెన్ పోర్స్ సమస్యతో బాధపడే వారు అలాగే ఈ సమస్య భవిష్యత్తులో రాకూడదు అనుకునే వారు ఇప్పుడు జాగ్రత్తలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పోర్స్ సమస్య రాకుండా ఉండాలన్నా అలాగే వచ్చిన వారు చర్మంపై ఏర్పడిన వ్యర్థాలను చేత్తో పిండకపోవడమే మంచిది. అలాగే విటమిన్ ఎ, విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల చర్మంలో వచ్చిన ఇన్ ప్లామేషన్ తగ్గడంతో పాటు చర్మం సహజ స్థితికి వస్తుంది. రోజూ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, టమాట వంటి వాటితో జ్యూస్ ను చేసి ఉదయం పూట తీసుకోవాలి. ఇలా జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ ఎ అందుతుంది. దీంతో చర్మంపై మచ్చలు తగ్గుతాయి. చర్మ కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కణాల్లో ఇన్ ప్లామేషన్ తగ్గి కొత్త కణజాలం తయారవుతుంది. అలాగే రోజూ బత్తాయి, కమలా పండ్ల రసాన్ని తీసుకోవాలి. దీంతో తగినంత విటమిన్ సి లభిస్తుంది. దీంతో చర్మంపై ఏర్పడిన గుంటలు తగ్గుతాయి. వీటితో పాటు ప్రోటీన్, ఫ్యాట్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని కోసం పుచ్చ గింజల పప్పును తీసుకోవాలి. రోజూ 25గ్రాముల పుచ్చ గింజల పప్పును నానబెట్టి తీసుకోవడం వల్ల ఓపెన్ పోర్స్ సమస్య చాలా సులభంగా తగ్గుతుంది. ఈ విధంగా ఆహారాన్ని తీసుకుంటూ చర్మంపై నల్ల మట్టితో మడ్ ప్యాక్ ను వేసుకోవాలి. నల్లటి మట్టిని సేకరించి మెత్తగా దంచాలి. తరువాత దానిని జల్లించి మెత్తటి మట్టిని తీసుకుని నానబెట్టాలి. ఈ మట్టి చల్లగా అయిన తరువాత ఇందులో పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ముఖానికి రక్తప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. దీంతో చర్మానికి పోషకాలు అందడంతో పాటు ఆ భాగంలో ఉన్న వ్యర్థాలు తొలగిపోతాయి. దీనిని అరగంట పాటు ఉంచుకుని ఆ తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఓపెన్ పోర్స్ సమస్య తగ్గుతుంది. ఈ విధంగా తగిన ఆహారాన్ని తీసుకుంటూ మడ్ ప్యాక్ వంటి వాటిని వేసుకోవడం వల్ల ఓపెన్ పోర్స్ సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.