Tomatoes For Blackheads : ముఖంపై బ్లాక్ హెడ్స్ సమస్యతో మనలో చాలా మంది ఇబ్బందిపడుతూ ఉంటారు. ఇవి ఎక్కువగా ముక్కు, కంటి కింది భాగం, గడ్డం, బుగ్గలు, నుదురు వంటి భాగాల్లో వస్తూ ఉంటాయి. జిడ్డు చర్మం ఉన్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. సహజంగా చర్మంపై మృతకణాలు, మురికి, దుమ్ము, ధూళి వంటివి పేరుకుపోతూ ఉంటాయి. చర్మంపై పేరుకుపోయిన వీటిని సరిగ్గా తొలగించకపోవడం వల్ల ముఖంపై ఉండే చర్మ రంధ్రాల్లో ఇవి పేరుకుపోయి క్రమంగా బ్లాక్ హెడ్స్ లాగా మారతాయి. బ్లాక్ హెడ్స్ వల్ల మనకు ఎటువంటి హాని కలగదు.
కానీ వీటి వల్ల ముఖం అందవిహీనంగా కనబడుతుంది. బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీటిని తొలగించుకోవడానికి బ్లాక్ హెడ్స్ స్ట్రిప్స్, స్క్రబర్, ఫేస్ వాష్ లను వాడుతూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి. ఎటువంటి ఖర్చు లేకుండా ముఖంపై ఉండే ఈ బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవాలనుకునే వారు ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కేవలం రెండంటే రెండు పదార్థాలను వాడి మనం ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం టమాటకాయను, పంచదారను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక టమాటాను తీసుకుని అడ్డంగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పంచదారను తీసుకోవాలి. ఇప్పుడు టమాట ముక్కను పంచదారలో అద్ది బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రుద్దాలి. ఇలా నిమిషం పాటు రుద్ది ఆరనివ్వాలి. పది నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. అలాగే ముఖం కూడా అందంగా మారుతుంది.