కలబంద మొక్కలను మన ఇంటి పెరట్లో కచ్చితంగా పెంచుకోవాలి. స్థలం లేకపోతే కుండీల్లో అయినా పెంచాలి. కలబంద మొక్క ఔషధ గుణాలకు గని వంటిది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కలబంద గుజ్జును ఉపయోగించి ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కలబంద గుజ్జును కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవచ్చు. తరువాత 30 నిమిషాలు ఆగి కడిగేయాలి. వారంలో 2 సార్లు ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది.
2. కలబంద గుజ్జును 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో ఆలివ్ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని కనుబొమ్మలపై రాయాలి. రాత్రి నిద్రించే ముందు ఇలా చేయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. దీంతో కనుబొమ్మలు అందంగా కనిపించడమే కాకుండా ఒత్తుగా పెరుగుతాయి.
3. కలబంద గుజ్జును కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. ఆ మిశ్రమాన్ని శరీరంపై రాయాలి. కొంత సేపు అయ్యాక స్నానం చేయాలి. దీని వల్ల చర్మంపై ఉండే మృతకణాలు పోతాయి. దుమ్ము, ధూళి పోయి చర్మం మెరుస్తుంది. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
4. కలబంద గుజ్జు, బాదంనూనెలను కొద్ది కొద్దిగా తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. రాత్రి నిద్రకు ముందు ఇలా చేయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తుంటే ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు.
5. కలబంద గుజ్జును కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాలు ఆగాక కడిగేయాలి. దీని వల్ల ముఖంపై ఉండే జిడ్డు, మురికి పోతాయి. ముఖం మెరుస్తుంది. కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
6. కలబంద గుజ్జు, పెరుగు, రోజ్ వాటర్‌లను కొద్ది కొద్దిగా తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. కొంత సేపటి తరువాత కడిగేయాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తుండాలి. దీంతో చర్మంపై ఉండే దద్దుర్లు తగ్గుతాయి. మచ్చలు, మొటిమలు పోతాయి. చర్మం మృదువుగా మారి మెరుస్తుంది.
7. ఆలివ్ నూనె, బాదంనూనె, కలబంద గుజ్జులను కొద్దిగా తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేసి దాన్ని స్ట్రెచ్ మార్క్స్‌పై రాయాలి. రాత్రి నిద్రకు ముందు ఇలా చేయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. వారం పాటు ఇలా చేస్తే తప్పక మార్పు కనిపిస్తుంది.