Betel Leaves : తమలపాకు.. ఇది మనందరికి తెలిసిందే. తమలపాకు ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. శుభ కార్యాల్లో దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. తలమపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని ఉపయోగించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అయితే చాలా మంది ఈ తమలపాకులో పొగాకు ఉత్పత్తులను ఉంచి నమిలి తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే తమలపాకు అనారోగ్యానికి దారి తీస్తుంది. తమలపాకును ఔషధంగా ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. తమలపాకులో ఉండే ఔషధ గుణాలు ఏమిటి.. దీనిని ఏ విధంగా ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
తమలపాకులో చిన్న బియ్యపు గింజంత సున్నాన్ని ఉంచి రోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల ఎముకలు ధృడంగా, ఆరోగ్యంగా మారతాయి. ఇలా తినడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే స్త్రీ, పురుషుల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతలను తగ్గించడంలో కూడా తమలపాకు మనకు సహాయపడుతుంది. రోజూ ఉదయం ఒక తమలపాకును బాగా నమిలి తినడం వల్ల హార్మోన్ల సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. అలాగే మన జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉండేలా చేయడంలో కూడా తమలపాకు మనకు ఎంతో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము.
లేదంటే మనం 100కు పైగా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అలాగే నేటి తరుణంలో చాలా మంది అస్థవ్యస్థమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉన్నారు. దీంతో అనేక రకాల జీర్ణసంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. అలాంటి వారుఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. జీర్ణ సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. ఇలా ఉదయం పరగడుపున తమలపాకును తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చర్మం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. అలాగే గాయాలు, నొప్పులు. వాపులపై తమలపాకు రసాన్ని రాసి తరువాత వాటిపై తమలపాకు పేస్ట్ ను ఉంచాలి.
తరువాత దానిపై వస్త్రాన్ని ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల గాయాలు, వాపులు, నొప్పులు త్వరగా మానుతాయి. ఈ విధంగా తమలపాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తమలపాకును తినేటప్పుడు దాని తొడిమను తీసేసి తినాలని వారు సూచిస్తున్నారు.