Cardamom Powder For Acidity : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కడుపులో మంట, అల్సర్లు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పొట్టలో యాసిడ్స్ ఎక్కువయ్యి పొట్ట అంచులకు ఇబ్బందిని కలిగిస్తుంది. దీంతో కడుపులో మంట, అల్సర్లు ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే మరికొందరిలో బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్ ల వల్ల పొట్టలో అల్సర్లు వస్తూ ఉంటాయి. ఈ సమస్యకు మందులు వాడి తగిన చికిత్స తీసుకున్నప్పటికి పొట్టలో అల్సర్లు మరలా వస్తూ ఉంటాయి. పొట్ట అంచుల వెంబడి జిగురు తగ్గడం వల్ల పొట్ట అంచులు పొడిబారతాయి. దీంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లు ఎక్కువగా మరలా అల్సర్లు వస్తూ ఉంటాయి. సహజ సిద్దంగా కూడా మనం ఈ అల్సర్లను తగ్గించుకోవచ్చు. పొట్టలో అల్సర్లు రాకుండా చేయడంలో మనకు యాలకుల పొడి ఎంతగానో ఉపయోగపడుతుంది. యాలకుల పొడిని వాడడం వల్ల పొట్టలో అల్సర్లు రాకుండా ఉంటాయని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ఈ యాలకుల పొడిని ఎలా ఉపయోగించడం వల్ల మనం పొట్టలో అల్సర్ల సమస్య నుండి బయటపడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్టలో అల్సర్ల సమస్యతో బాధపడే వారు 2 గ్రాముల యాలకుల పొడిని తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి కలపాలి. తరువాత ఈ నీటిలో చిటికెడు పసుపును వేసి కలపాలి. అలాగే ఈ నీటిలో రుచి కొరకు తేనెను కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న నీటిని తాగడం వల్ల పొట్టలో అల్సర్ల సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. యాలకుల పొడిలో అలాగే పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పొట్టలో ఉండే క్రిములను నశింపజేయడంలో ఉపయోగపడుతున్నాయని వారు చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల పొట్ట అంచుల వెంబడి ఉండే మ్యూకస్ ( జిగురు) ఉత్పత్తి పెరుగుతుంది. మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల యాసిడ్ లు పొట్ట అంచులను ఇబ్బందులకు గురి చేయకుండా ఉంటాయి. దీంతో అల్సర్లు, పుండ్లు వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. యాలకుల నీటిని తాగడం వల్ల పొట్ట అంచుల వెంబడి మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడంతో పాటు బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్పెక్షన్ లు కూడా తగ్గుతాయి.
దీంతో పొట్టలో అల్సర్లు, మంట వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే కాఫీ, టీ లను తాగడం తగ్గించాలి. కాఫీలు పొట్ట అంచుల వెంబడి మ్యూకస్ ఉత్పత్తిని తగ్గించి పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో సమస్యలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కనుక టీ, కాఫీలను తాగడం తగ్గించాలి. అదే విధంగా మూడు పూటలా తినడానికి ముందు నీటిని ఎక్కువగా తాగాలి. ఇలా చేయడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో అల్సర్లు, మంట వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే నీటిని తాగడం వల్ల పొట్టలో ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోయి మంచి బ్యాక్టీరియా ఎక్కువగా తయారవుతుంది. కడుపులో మంట, అల్సర్లు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ చిట్కాలను పాటించడం వల్ల సమస్య నుండి సులభంగా బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.