Coriander Seeds For Headache : మనల్ని వేధించే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో తలనొప్పి సమస్య కూడా ఒకటి. తలనొప్పి సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. తలనొప్పి వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. తలనొప్పి రావడానికి గల కారణాలను తెలుసుకుని తగిన చికిత్స తీసుకుంటే చాలా సులభంగా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అసలు తలనొప్పి రావడానికి గల కారణాలు అలాగే ఈ తలనొప్పి నుండి ఎలా బయట పడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జలుబు, జ్వరం, కంటి చూపు తగ్గడం, మైగ్రేన్, ఒత్తిడి, శరీరంలో వేడి వంటి కారణాల చేత తలనొప్పి వస్తుంది. అలాగే కొన్నిసార్లు ఎటువంటి కారణాలు లేకపోయినా కూడా తలనొప్పి వస్తుంది.
గంధం చెక్కను నీటితో కలిపి మెత్తగా నూరాలి. ఇలా తయారు చేసుకున్న గంధానికి సమానంగా కర్పూరాన్ని కలిపి నుదుటికి పట్టులా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల శరీరంలో వేడి కారణంగా తలెత్తే తలనొప్పి తగ్గుతుంది. అలాగే ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాస్ నీటిలో వేసి అర గ్లాస్ కషాయం అయ్యే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని వడకట్టి గోరు వెచ్చగా రెండు పూటలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల జలుబు, సైనస్ వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది. అదే విధంగా ధనియాలను నీటితో కలిపి మెత్తగా నూరాలి. దీనిని మాడుపై పట్టులా వేసుకోవాలి.
ఇలా వేసుకోవడం వల్ల వేడి వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది. బచ్చలి ఆకులను మెత్తగా నూరి నుదుటి మీద పట్టులా వేసుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. అలాగే రాళ్ల ఉప్పును, పటిక బెల్లాన్ని సమానంగా తీసుకుని 2 గ్రాముల మోతాదులో తీసుకుని గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. రోజుకు రెండు సార్లు ఇలా తీసుకోవడం వల్ల వేడి ప్రదేశాల్లో తిరగడం వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది. అలాగే 2 గ్రాముల ధనియాలను ఒక గ్లాస్ నీటిలో వేసి కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయాన్ని వడకట్టుకుని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వల్ల కలిగే తలనొప్పి తగ్గుతుంది. అలాగే ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చున్న, నిలబడ్డా కూడా తలనొప్పి వస్తుంది. కనుక అప్పుడప్పుడూ భంగిమలు మారుస్తూ కూర్చోవాలి. అలాగే చలికాలంలో చలి వల్ల కూడా చాలా మంది తలనొప్పితో బాధపడుతూ ఉంటారు.
అలాంటి వారు ఎండకు కూర్చోవడం వల్ల, వ్యాయామం చేయడం వల్ల ఈ తలనొప్పి తగ్గుతుంది. అలాగే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. కొందరిలో ఆహారం సమయానికి తీసుకోకపోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. కనుక సమయానికి తప్పకుండా ఆహారం తీసుకోవాలి. తలనొప్పి రాగానే చాలా మంది మందులను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల అనేక దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుంది. తలనొప్పి రావడానికి గల కారణాలను తెలుసుకుని ఇంటి చిట్కాల ద్వారా పరిష్కరించుకోవడమే చాలా ఉత్తమమని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ చిట్కాలను వాడినప్పటికి తలనొప్పి తగ్గకపోతే వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.