దాదాపుగా భారతీయులందరి ఇళ్లలోనూ తేనె, దాల్చిన చెక్క సహజంగానే ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, దగ్గు, జలుబు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ రెండింటి మిశ్రమాన్ని ఏ విధంగా తీసుకుంటే ఏయే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తేనె, దాల్చినచెక్క మిశ్రమం మొటిమలను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ దాల్చినచెక్క పొడి, మూడు టేబుల్ స్పూన్ల తేనెను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలపై రాయాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి. దీంతో మొటిమలు తగ్గుతాయి. రోజూ ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. దీంతోపాటు ఇతర చర్మ సమస్యలకు కూడా ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా గజ్జి, తామర, ఇతర చర్మ ఇన్‌ఫెక్షన్లు ఈ మిశ్రమంతో తగ్గుతాయి.
2. తేనె, దాల్చిన చెక్కల మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. ఈ రెండింటిలోనూ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ మిశ్రమం యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అలాగే జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయి. జీర్ణాశయ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
3. ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించడంలో తేనె, దాల్చిన చెక్క మిశ్రమం బాగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ తేనె, అంతే మోతాదులో దాల్చిన చెక్క పొడిలను గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. దాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల తేనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలను కలిపి రోజూ ఒకసారి తాగాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి.
4. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు తేనె, దాల్చిన చెక్క మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే రక్త నాళాల్లో అది పేరుకుపోతుంది. దీంతో గుండె జబ్బులు వస్తాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వస్తాయి. అందువల్ల అవి రాకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలి. ఇందుకు గాను మూడు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనెను టీ డికాషన్‌లో కలిపి తాగాలి. రోజూ ఇలా చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
5. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారికి కూడా తేనె, దాల్చినచెక్క పొడి మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. మూత్రాశయంలో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, అర టీస్పూన్ తేనెలను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు ఒక్కసారి తీసుకుంటే మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
6. అధిక బరువును తగ్గించుకోవాలంటే రోజూ తేనె, దాల్చిన చెక్క పొడి మిశ్రమాన్ని తీసుకోవాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె, దాల్చిన చెక్క పొడిలను కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. దీంతో బరువు త్వరగా తగ్గవచ్చు. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.
7. తేనె, దాల్చిన చెక్కలలో దృఢమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల చిగుళ్ల సమస్యలు, దంతాల ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. తేనె, దాల్చినచెక్క పొడి కలిపిన పేస్ట్‌ను దంతాలు, చిగుళ్లపై రాయాలి. రోజూ ఇలా చేస్తే నోరు శుభ్రంగా ఉంటుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
8. దగ్గు, జలుబును తగ్గించేందుకు కూడా తేనె, దాల్చిన చెక్క మిశ్రమం పనిచేస్తుంది. రెండింటిలోనూ యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబుకు కారణమయ్యే వైరస్‌లపై పోరాటం చేస్తాయి. దీంతో ఆయా సమస్యలు వెంటనే తగ్గుతాయి.