Drumstick Leaves : మన పెరట్లో ఉండే చెట్లల్లో మునగ చెట్టు కూడా ఒకటి. మునగకాయలను మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మునక్కాయలే కాకుండా మునగ చెట్టు ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సర్వరోగ నివారిణి మునగ అని చెప్పవచ్చు. ఆయుర్వేదంలో దాదాపు 300 రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మునగాకును ఉపయోగిస్తారట. మునగాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మనకు వచ్చే రకరకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.
రోగాల బారిన పడకుండా, అలసట లేకుండా రోజంతా ఉత్సాహంగా పని చేయాలంటే మునగాకును ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. మనం డబ్బులు పెట్టి కొనే కూరగాయల్లో లేని ఎన్నో ఔషధ గుణాలు మునగాకులో ఉన్నాయి. మునగాకును రోజూ ఏదో ఒక విధంగా ఆహారంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రాత్రి పడుకునే ముందు ముగాకులో తేనెను కలిపి తీసుకోవడం వల్ల రేచీకటి సమస్య దూరం అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఈ మునగాకుకు ఉంటుంది.

తరచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడే వారు మునగాకును తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. పాలల్లో మునగాకు రసాన్ని కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారు మునగాకును ఆముదంతో కలిపి వేడి చేయాలి. తరువాత వీటిని నొప్పులు ఉన్న చోట ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. కీరదోసకాయ రసంలో మునగాకు రసాన్ని కలిపి తీసుకోవడం వల్ల మూత్రపిండాల సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. అలాగే బాదం పాలల్లో ఒక టేబుల్ స్పూన్ మునగాకు రసాన్ని కలిపి తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
సోరియాసిస్ వ్యాధితో బాధపడే వారు కొబ్బరి నీళ్లల్లో మునగాకు రసాన్ని కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి సోరియాసిస్ నుండి విముక్తి కలుగుతుంది. అలాగే చర్మంపై మొటిమలు, మచ్చలతో బాధపడే వారు మునగాకు రసంలో నిమ్మరసాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అధిక బరువు సమస్యను తగ్గించడంలో కూడా మునగాకు మనకు ఎంతగానో సహాయపడుతుంది.
మునగాకు రసంలో నిమ్మరసం, తేనె కలిపి ప్రతిరోజూ పరగడుపున తీసుకోవడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా మునగాకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనం అనారోగ్యాల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.