Remedies For Piles : మనల్ని వేధించే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో మొలల సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉన్నారు. అస్థవ్యస్థమైన మన ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. వేడి శరీరతత్వం ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే జంక్ ఫుడ్ ను తీసుకోవడం, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తినడం, నీటిని తక్కువగా తాగడం, మలబద్దకం, ఫైబర్ కలిగిన ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవడం, ఎక్కువగా కూర్చొని పని చేసే వారిలో, అధిక బరువుతో బాధపడే వారిలో కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. మొలల కారణంగా తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతుంది. అలాగే ఆ భాగంలో మంటతో పాటు రక్తస్రావం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా మంది మొలల ను శస్త్రచికిత్సల ద్వారా తొలగించుకుంటూ ఉంటారు.
శస్త్రచికిత్సతో అవసరం లేకుండా ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి బాహ్య మరియు అంతర్గత మొలలను మనం తగ్గించుకోవచ్చు. మొలలను తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం అర చెక్క నిమ్మకాయను, పావు టీ స్పూన్ పసుపును, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసాన్ని పిండాలి. తరువాత ఇందులోనే పసుపు, జీలకర్ర పొడి వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల ప్రేగుల్లో మలం మెత్తబడుతుంది. మలబద్దకం సమస్య తలెత్తకుండా ఉంటుంది. మలవిసర్జన సాఫీగా సాగుతుంది. అలాగే జీలకర్ర జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ విధంగా పసుపు, నిమ్మరసం, జీలకర్ర పొడిని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల అంతర్గతంగా ఉండే మొలలు తగ్గుతాయి.
ఇలా 15 రోజుల పాటు తీసుకోవడం వల్ల మొలల నుండి రక్తం కారడం కూడా తగ్గుతుంది. ఇక బాహ్య మొలలతో బాధపడే వారు వామును ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక టీ స్పూన్ వామును నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి వామును మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనికి సమానంగా ఆర్గానిక్ పసుపును కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు మొలలపై రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మొలలు ఎండిపోయి రాలిపోతాయి. ఈ చిట్కాలను పాటిస్తూనే మొలల సమస్యతో బాధపడే వారు నీటిని ఎక్కువగా తాగాలి. కారం, నూనె పదార్థాలను, మసాలా పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మొలల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.