Toothache : మనలో చాలా మంది దంతాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. దంతాల నొప్పుల కారణంగా విపరీతమైన బాధ కలుగుతుంది. ఆహారాన్ని నమిలి తినే సమయంలో ఈ నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి దంతాల నొప్పుల కారణంగా మనం ఆహారాన్ని కూడా సరిగ్గా తీసుకోలేకపోతూ ఉంటాము. దంతాల నొప్పుల కారణంగా నోటి దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. తరచూ జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. దంతం చుట్టూ ఉబ్బినట్టుగా ఉంటుంది. దంతాల లోపల ఉండే సున్నితమైన నరాలు ఇన్ఫెక్షన్ కు గురి అయినప్పుడు ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. అలాగే దంతాల నొప్పులు రావడానికి ఇతర కారణాలు కూడా ఉంటాయి.
దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, దంతక్షయం, చిగుళ్లు ఆరోగ్యంగా లేకపోవడం, పొగాకు వంటి వాటిని నమలడం వంటి కారణాల చేత కూడా దంతాల నొప్పులు వస్తూ ఉంటాయి. కారణాలేవైనప్పటికి దంతాల నొప్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యి దంతాలు ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ల కారణంగా వచ్చే దంతాల నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. అదే విధంగా ఇతరత్రా కారణాల చేత వచ్చే దంతాల నొప్పులను మాత్రం మనం కొన్ని రకాల ఇంటి చిట్కాలను వాడి నయం చేసుకోవచ్చు.
దంతాల నొప్పులను తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దంతాల నొప్పులను తగ్గించడంలో కొబ్బరి చెట్టు వేర్లు ఎంతగానో సహాయపడతాయి. కొబ్బరి చెట్టు వేర్లను నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల దంతాల నొప్పులు, దంతాల సున్నితత్వం వంటి సమస్యలు తగ్గుతాయి. దంతాల నొప్పులను తగ్గించడంలో లవంగాల నూనె కూడా ఎంతగానో సహాయపడతాయి. వీటిలో యాంటీ మైక్రోబయాల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దంతాల నొప్పులతో బాధపడే వారు ఒక కప్పు నీటిలో లవంగం నూనెను వేసి కలిపి నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల దంతాల నొప్పులు తగ్గుతాయి. అలాగే లవంగాలను పేస్ట్ గా చేసి నొప్పి ఉన్న దంతాలపై నేరుగా రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
అలాగే అవకాడోలో గింజను దంచి నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల దంతాల నొప్పులు తగ్గుతాయి. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలను, ఉప్పుతో కలిపి మెత్తగా నూరాలి. తరువాత ఈ పేస్ట్ ను దంతాలపై రాయడం వల్ల దంతాల నొప్పి తగ్గుతుంది. అలాగే బొప్పాయి పండు గుజ్జును లేదా బొప్పాయి చెట్టు వేరును పేస్ట్ గా చేసి దంతాలపై రాయడం వల్ల దంతాల నొప్పులు తగ్గుతాయి. అలాగే జామాకులను, జామ చెట్టు బెరడును నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల కూడా దంతాల నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా దంతాల నొప్పులను తగ్గించుకోవచ్చు. అయితే దంతాల నొప్పులు మరీ తీవ్రంగా ఉన్న వారు మాత్రం ఈ చిట్కాలను పాటించడానికి బదులుగా వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం.