Fenugreek Seeds For Dandruff : మనకు సులభంగా లభించే పదార్థాలతో ఒక చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న చుండ్రు సమస్య తగ్గుతుంది. ఈ మధ్య కాలంలో చుండ్రు సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారని చెప్పవచ్చు. చుండ్రు కారణంగా జుట్టు రాలడం, దురద వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి షాంపులను వాడుతూ ఉంటారు. షాంపులకు బదులుగా ఇప్పుడే చెప్పే చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చిట్కాను వాడడం వల్ల చుండ్రు సమస్య తగ్గడంతో పాటు జుట్టుకు ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది.
జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యతో పాటు జుట్టు రాలడాన్ని కూడా తగ్గించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అలాగే దీనిని ఎలా వాడాలి.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ఎండిన ఉసిరికాయ ముక్కలను, 2 టేబుల్ స్పూన్ల మెంతులను, 2 టేబుల్ స్పూన్ల కాళోంజి విత్తనాలను, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను, 4 మందార ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఉసిరికాయ ముక్కలు, కాళోంజి విత్తనాలు, మెంతులు వేసి తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజూ ఈ వీటిని నీటితో సహా జార్ లోకి తీసుకోవాలి.
ఇందులోనే మందార ఆకులు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని గిన్నెలో వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ లో కొబ్బరి నూనె కలిపి తల చర్మానికి అంటేలా బాగా రాసుకోవాలి. అలాగే జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు రాసుకోవాలి. దీనిని రెండు గంటల పాటు అలాగే ఉంచి ఆ తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారి చేయడం వల్ల ఎంతోకాలంగా వేధిస్తున్న చుండ్రు సమస్య క్రమంగా తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.