Sleeplessness : మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో నిద్రలేమి కూడా ఒకటి. నిద్రలేమి సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. పని ఒత్తిడి, ఆందోళన, మారిన జీవన విధానం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి తదితర కారణాల వల్ల కంటి నిండా నిద్ర లేకుండా పోతోంది. సరైన నిద్రలేకపోవడం వల్ల కోపం, చిరాకు, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మంది నిద్రపట్టడానికి నిద్రమాత్రలపై ఆధారపడాల్సిన పరిస్థితి ప్రస్తుత కాలంలో నెలకొంది. కానీ నిద్రమాత్రలను ఎక్కువగా వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
సహజ సిద్దంగా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సులువుగా పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకోవచ్చు. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు పాటించాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు రోజూ రాత్రి భోజనం చేసిన తరువాత అరటి పండును తినడం వల్ల చక్కగా నిద్రపడుతుంది. అరటి పండులో అధికంగా ఉండే పొటాషియం, మెగ్నిషియం కండరాలను ఉత్తేజపరిచి ఒత్తిడిని తగ్గించి మనల్ని నిద్రలోకి జారుకునేలా చేస్తాయి. అరటిపండుతోపాటు అరటి తొక్క కూడా మనకు నిద్రలేమి సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది.
అరటి తొక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాత్రి భోజనంలో కొద్ది మోతాదులోనైనా సరే పెరుగును తప్పకుండా తీసుకోవాలి. పెరుగులో ఉండే ట్రిప్టోపాన్ నిద్ర పట్టడంలో సహాయపడుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉన్న వారు దానిని మానుకోవాలి లేదా మధ్యాహ్నం నిద్రను కొద్ది సమయం వరకు మాత్రమే పరిమితం చేయాలి. మానసిక ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండాలి. మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి.
శరీరానికి అలసటను కలిగించే పనులు చేయాలి. వ్యాయామాలు చేయాలి. అలాగే ధ్యానం, యోగా వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. దిండ్లు, దుప్పట్లు అప్పటికప్పుడు శుభ్ర పరుస్తూ వాటిని మారుస్తూ ఉండాలి. నిద్రకు వెలుతురు వల్ల ఆటంకం కలగకుండా తక్కువ వెలుతురు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. రోజుకు కనీసం 6 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. కనీస సమయం నిద్రపోకపోవడం వల్ల ఆ ప్రభావం మెదడు మీద పడి జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తగినంత నిద్రలేకపోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. అదేవిధంగా రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు వచ్చి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. నిద్రలేమి సమస్య కారణంగా మెదడుకు తగినంత విశ్రాంతి లభించదు. తద్వారా చిరాకు, కోపం, చిన్న విషయాలకే ఆందోళన చెందడం వంటి సమస్యలు వస్తాయి. నిద్రలేమి సమస్య కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ చిట్కాలను వాడి నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు.