Hair Growth : పొడవైన, ఒత్తైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. జుట్టు ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా అందంగా కనిపిస్తాము. జుట్టు అందంగా కనిపించడానికి గాను మనం మార్కెట్ లో దొరికే అన్ని రకాల షాంపూలను, హెయిర్ స్ప్రేలను, హెయిర్ డైలను వాడుతూ ఉంటాం. వీటిని వాడడం వల్ల తాత్కాలిక ప్రయోజనం మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా వీటిలో రసాయనాలను ఎక్కువగా వాడతారు.
ఈ రసాయనాల కారణంగా జుట్టు రాలడం మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీటిని ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నది నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి రసాయనాలను వాడకుండా సహజంగా మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే మన జుట్టును అందంగా, ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. కేవలం రెండు పదార్థాలను ఉపయోగించి మన జుట్టు ఆరోగ్యాన్ని ఏవిధంగా మెరుగుపరుచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఇంట్లో ఉండే కొబ్బరి నూనెను, నిమ్మరసాన్ని ఉపయోగించి మనం మన జుట్టును అందంగా, ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవాలి. తరువాత ఇవి రెండూ కలిసేలా బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని తలతోపాటు జుట్టంతటికీ రాసి జుట్టు కుదుళ్లలోకి ఇంకేలా 15 నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేయాలి.
ఇలా రాసిన గంట తరువాత తలస్నానం చేయాలి. ఈ చిట్కాను వారానికి ఒకటి లేదా రెండుసార్లు పాటించడం వల్ల జుట్టు రాలడం ఆగుతుంది. అంతేకాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల జుట్టు అందంగా, ఒత్తుగా, పొడుగ్గా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఈ చిట్కాను వాడి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండానే చాలా తక్కువ ఖర్చులో మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.