గ్యాస్ సమస్య సహజంగానే చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. జీర్ణాశయంలో అధికంగా గ్యాస్ చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే ఎప్పుడో ఒకసారి గ్యాస్ సమస్య వస్తే ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. కానీ పదే పదే గ్యాస్ సమస్య వస్తుంటే వైద్యున్ని సంప్రదించి అందుకు అనుగుణంగా పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. ఇక సాధారణ గ్యాస్ సమస్యకు కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే చాలు. దాంతో గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు, మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
* భోజనం చేశాక 45 నిమిషాల అనంతరం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ వాము, కొద్దిగా రాక్ సాల్ట్ కలుపుకుని తాగాలి. దీంతో గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
* పుదీనా నీటిని రోజంతా తాగుతూ ఉంటే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
* భోజనం చేశాక గంట తరువాత యాలకుల నీటిని తాగితే సమస్య తగ్గుతుంది.
* జీలకర్ర, ధనియాలు, సోంపు గింజలతో తయారు చేసిన టీని రోజులో 3 సార్లు తాగాలి. భోజనం చేశాక 40 నిమిషాలకు, లేదా భోజనానికి 40 నిమిషాల ముందు తాగితే ప్రయోజనం ఉంటుంది.
* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ ఇంగువను కలుపుకుని తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది.
* ఒక టీస్పూన్ అల్లం రసాన్ని అంతే మోతాదులో నిమ్మరసంతో కలిపి తాగితే గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
* బాగా మరిగిన నీటిలో 5 నుంచి 10 నిమిషాల పాటు అర టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని అలాగే ఉంచి అనంతరం ఆ మిశ్రమాన్ని నిద్రకు ఉపక్రమించే ముందు తాగాలి. నిత్యం ఇలా చేస్తే గ్యాస్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
* భోజనం చేసిన వెంటనే నీటిని అతిగా తాగరాదు. భోజనం అధికంగా చేయడం మానుకోవాలి. జీర్ణాశయంలో కనీసం పావు వంతు ఖాళీ ఉండేలా భోజనం చేయాలి. దీంతో గ్యాస్ రాకుండా ఉంటుంది. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది.