Hair Packs For Hair Growth : చలికాలంలో మన చర్మంతో పాటు జుట్టు కూడా పొడిబారుతుంది. చల్లటి గాలులు, పొగమంచు కారణంగా జుట్టు పొడిబారడం, జుట్టు చివర్లు చిట్లడం, జుట్టు మృదుత్వాన్ని కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దాదాపు ప్రతి ఒక్కరు చలికాలంలో ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే షాంపులు, కండీష్ నర్ లను వాడడానికి బదులుగా కొన్ని సహజ సిద్దమైన హెయిర్ ప్యాక్ లను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ లను వాడడం వల్ల జుట్టు మృదువుగా, అందంగా తయారవుతుంది. చలికాలంలో జుట్టు పొడిబారడాన్ని తగ్గించి జుట్టును మృదువుగా మార్చే హెయిర్ ప్యాక్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు పొడిబారడాన్ని తగ్గించడంలో అరటిపండు మనకు ఎంతగానో సహాయపడుతుంది. బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత ఇందులో 2 టీ స్పూన్ల ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత తలస్నానం చేసి కండీషనర్ ను రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుంది. అలాగే కోడిగుడ్డును వాడడం వల్ల కూడా జుట్టు పట్టులాగా తయారవుతుంది. ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్లసొనను తీసుకోవాలి. తరువాత ఇందులో 2 టీ స్పూన్ల శనగపిండి, బాదం గింజల పొడి, తగినంత గులాబి నీరు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి.
ఇలా చేయడం వల్ల జుట్టు పట్టులాగా, ఆరోగ్యంగా తయారవుతుంది. అదే విధంగా గుమ్మడికాయ గుజ్జును తీసుకుని అందులో తేనె వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత తలస్నానం చేయాలి. ఇలా గుమ్మడికాయను ఉపయోగించడం వల్ల కూడా జుట్టు మృదువుగా తయారవుతుంది. అలాగే మెంతులను ఉపయోగించడం వల్ల కూడా జుట్టు పొడిబారడం తగ్గుతుంది. మెంతులకు కొబ్బరి పాలను మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుంది. ఈ విధంగా ఈ హెయిర్ ప్యాక్ లను వాడడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుంది.