Hibiscus Leaves And Flowers For Hair : ఒత్తుగా, నల్లగా, పొడవుగా ఉండే జుట్టును అందరూ కోరుకుంటారు. జుట్టు చక్కగా పెరగడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేక రకాల చిట్కాలను వాడుతూ ఉంటారు. రసాయనాలు కలిగిన హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. ఈ రసాయనాల కారణంగా జుట్టు మరింత దెబ్బతినే అవకాశం ఉంది. కనుక మనం జుట్టు పెరుగుదలకు వీలైనంత వరకు సహజ సిద్దంగా లభించే పదార్థాలను వాడడమే మంచిది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో మనకు మందార చెట్టు ఎంతగానో సహాయపడుతుంది. మందార చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు . మందార చెట్టు ఆకులు, పూలల్లో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి.
అయితే జుట్టు పెరుగుదలకు మందార చెట్టును ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా 10 మందార ఆకులను, 5 మందార పువ్వులను తీసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత దీనికి 100 ఎమ్ ఎల్ కొబ్బరి నూనెను వేడి చేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టేలా బాగా మర్దనా చేసుకోవాలి. దీనిని గంట పాటు అలాగే ఉంచుకుని ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. అలాగే మందార పువ్వులను ఉపయోగించి మనం చుండ్రు సమస్యను నివారించుకోవచ్చు. దీని కోసం నీటిలో మందార పువ్వులను వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ టీ ని వడకట్టి చల్లారనివ్వాలి. తలస్నానం చేసిన తరువాత ఈ టీని జుట్టు కుదుళ్లకు తల చర్మానికి పట్టించాలి.
ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గడంతో పాటు జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది. అలాగే మందార ఆకులను పేస్ట్ గా చేసి దాని నుండి రసాన్ని తీయాలి. అదే విధంగా ఉల్లిపాయను పేస్ట్ గా చేసి దాని నుండి రసాన్ని తీయాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి జుట్టుకు పట్టించాలి. దీనిని అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు ఒత్తుగా, ఆరోగ్యవంతంగా తయారవుతాయి. అలాగే ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీటిని తీసుకోవాలి. ఇందులో పావు కప్పు ఎండిన మందార పువ్వు రేకులను వేసి మరిగించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఈ నీటిలో ఒక టీ స్పూన్ గ్లిజరిన్, ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె, 5 చుక్కల లావెండర్ నూనెను వేసి కలపాలి. తరువాత ఈ నీటిని వడకట్టి స్ప్రే బాటిల్ పోసుకోవాలి.
తరువాత ఈ నీటిని జుట్టుపై అలాగే జుట్టు కుదుళ్లపై స్ప్రే చేసుకోవాలి. తరువాత సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఇప్పుడు జుట్టుకు హెయిర్ క్యాప్ ను పెట్టుకుని రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కాంతివంతంగా, అందంగా, మృదువుగా తయారవుతుంది. ఈ విధంగా మందార చెట్టు ఆకులు, పూలు మన జుట్టు పెరుగుదలలో ఎంతగానో సహాయపడతాయని వీటిని పైన విధంగా ఉపయోగించడం వల్ల అందమైన ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.