పాదాల నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించేందుకు చిట్కాలు..!

రోజూ షూస్‌ ధరించే వారు అప్పుడప్పుడు వాటి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతుంటారు. సాక్సులను సరిగ్గా శుభ్రం చేయకపోయినా, షూస్‌ను శుభ్రంగా ఉంచుకోకపోయినా వాటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. అయితే వాటిని శుభ్రంగా ఉంచుకున్నా కూడా ఒక్కోసారి బాక్టీరియా వల్ల పాదాల నుంచి దుర్వాసన వస్తుంటుంది. చెమట ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఆ వాతావరణంలో బాక్టీరియా పెరుగుతుంది. దీంతో సహజంగానే పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. షూస్‌ తీసేశాక కూడా ఆ దుర్వాసన అలాగే ఉంటుంది. అయితే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల పాదాల నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే…

home remedies for foot odor

1. బ్లాక్‌ టీలో ట్యానిక్‌ యాసిడ్లు ఉంటాయి. ఇవి దుర్వాసనను కలిగించే బాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో పాదాలకు సంరక్షణ లభిస్తుంది. అలాగే చెమట తక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో రెండు టీ బ్యాగ్స్‌ వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత బ్యాగ్స్‌ను తీసేసి అందులో మరింత నీటిని కలపాలి. కొంతసేపు ఆ మిశ్రమాన్ని అలాగే ఉంచాలి. అనంతరం ఆ నీటిలో పాదాలను 15-30 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో పాదాల నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. బాక్టీరియా నశిస్తుంది. పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.

2. పాదాలపై కొన్ని చుక్కల లావెండర్‌ ఆయిల్‌ వేసి సున్నితంగా మర్దనా చేయాలి. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఇలా చేయాలి. దీంతో పాదాలపై ఉండే బాక్టీరియా నశిస్తుంది. పాదాల నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. పాదాల నుంచి సువాసన వస్తుంది.

3. పాదాల నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించేందుకు యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు పాదాలపై ఉండే బాక్టీరియాను ఈ వెనిగర్‌ నాశనం చేస్తుంది. ఒక బకెట్‌ గోరు వెచ్చని నీటిలో అర కప్పు యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వేసి బాగా కలపాలి. అనంతరం ఆ నీటిలో పాదాలను 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. దీని వల్ల బాక్టీరియా నశించి పాదాల నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది.

4. షూస్‌ ధరించేటప్పుడు పాదాలపై కొద్దిగా మొక్కజొన్న పిండిని చల్లాలి. దీంతో చెమట తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఉత్పన్నమయ్యే చెమటను ఆ పిండి పీల్చుకుంటుంది. దీంతో పాదాలు పొడిగా ఉంటాయి. బాక్టీరియా పెరగకుండా ఉంటుంది. పాదాల నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది.

5. కొద్దిగా చక్కెర, కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా నీరు వేసి ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారు చేయాలి. దాన్ని పాదాలకు రాయాలి. కొంత సేపటి తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల చర్మం సంరక్షింపబడుతుంది. చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. దీంతో చెమట తక్కువగా ఉత్పత్తి అవుతుంది. బాక్టీరియా నశిస్తుంది. పాదాల దుర్వాసన తగ్గుతుంది.

6. ఒక బకెట్‌ గోరు వెచ్చని నీటిలో రెండు కప్పుల ఎప్సమ్‌ సాల్ట్‌ కలిపి ఆ నీటిలో పాదాలను 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా రోజూ చేయడం వల్ల పాదాల దుర్వాసన తగ్గుతుంది. పాదాలపై బాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది.

7. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా బియ్యం వేయాలి. అర గంట పాటు ఉన్నాక బియ్యాన్ని తీసి నీటిని సేకరించాలి. అందులో మరింత నీటిని కలిపి ఆ నీటిలో పాదాలను 10-15 నిమిషాల పాటు ఉంచాలి. పాదాల దుర్వాసన తగ్గుతుంది. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది.

8. కొబ్బరినూనెలో లారిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది బాక్టీరియాను నాశనం చేస్తుంది. పాదాల దుర్వాసనను తగ్గిస్తుంది. కొబ్బరినూనెతో పాదాలను 10-15 నిమిషాల పాటు మర్దనా చేయాలి. రాత్రి నిద్రకు ముందు ఇలా చేయాలి. ఇలా రోజూ చేస్తే పాదాల దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts