జీర్ణాశయంలో ఆమ్లాల స్థాయిలు పెరగడం వల్ల అజీర్తి సమస్య వస్తుంది. అలాగే అతిగా తినడం, మాంసాహారాన్ని అతిగా తీసుకోవడం, ఆహారాన్ని పూర్తిగా ఉడికంచకుండా తినడం.. వంటి అనేక కారణాల వల్ల కూడా మనలో అధిక శాతం మందికి అప్పుడప్పుడు అజీర్ణం సమస్య వస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల అజీర్ణం సమస్య నుంచి బయట పడవచ్చు. ఆ చిట్కాలు ఏమిటంటే…
* అల్లం దాదాపుగా భారతీయులందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీన్ని నిత్యం కూరల్లో వేస్తుంటారు. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అజీర్ణం సమస్య ఇట్టే తగ్గుతుంది. అందుకు గాను 2 టీస్పూన్ల అల్లం రసాన్ని భోజనం చేశాక సేవించాలి. లేదా ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో చిన్న అల్లం ముక్క వేసి మరిగించాలి. అనంతరం ఆ నీటిని తాగాలి. భోజనం చేశాక ఇలా చేయడం వల్ల అజీర్ణం సమస్య ఏర్పడకుండా ఉంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అల్లం రసంను నిత్యం ఉదయాన్నే పరగడుపున సేవించడం వల్ల కూడా అజీర్ణం సమస్య నుంచి బయట పడవచ్చు.
* సోంపు గింజల్లో ఉండే ఫెన్ కోన్, ఈస్ట్రజోల్ అనబడే సమ్మేళనాలు జీర్ణాశయంలో గ్యాస్ ఏర్పడకుండా చూస్తాయి. దీంతోపాటు జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తాయి. అందువల్ల అజీర్ణం సమస్య తగ్గుతుంది. భోజనం చేశాక గుప్పెడు సోంపు గింజలను తినడం వల్ల అజీర్ణం సమస్య నుంచి బయట పడవచ్చు. లేదా సోంపు గింజలతో టీ తయారు చేసుకుని తాగినా ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
* వాములో ఉండే ఎంజైమ్‌ను జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తాయి. భోజనం చేశాక 2 టీస్పూన్ల వాములో కొద్దిగా ఉప్పు కలిపి బాగా నలిపి ఆ మిశ్రమాన్ని అలాగే తినాలి. అనంతరం ఒక గ్లాస్ నీటిని తాగాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. గ్యాస్ కూడా ఏర్పడకుండా ఉంటుంది.
* ధనియాల్లో యాంటీ స్పాస్మోడిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల జీర్ణ సమస్యలైన గ్యాస్, అజీర్ణం తగ్గుతాయి. ధనియాలలో ఉండే యురంద్రాల్ అనబడే సమ్మేళనం లివర్‌లోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఆకలి పెరుగుతుంది. ఒక పాత్రలో ఒక గ్లాస్ నీటిని బాగా మరిగించి అందులో చిటికెడు ధనియాల పొడి వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని సేవించాలి. ఇలా చేయడం వల్ల అజీర్ణం సమస్య నుంచి బయట పడవచ్చు.
* ఉసిరికాయల్లో యాంటీ బాక్టీరియల్, అప్రోడిసియాక్, డైయురెటిక్, లాక్సేటివ్, కార్మినేటివ్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల అవి అనేక అనారోగ్య సమస్యలకు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ క్రమంలోనే వాటి వల్ల అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. భోజనం చేశాక 2 టీస్పూన్ల ఉసిరికాయ జ్యూస్‌ను తాగాలి. లేదా ఒక పెద్ద ఉసిరికాయను తినాలి. దీంతో అజీర్ణం బాధించదు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365