కాలుష్యం అయిన నీరు లేదా ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు వాటిల్లో ఉండే బాక్టీరియా ద్వారా టైఫాయిడ్ జ్వరం వస్తుంది. దీని వల్ల ఇన్‌ఫెక్షన్ జీర్ణవ్యవస్థ నుంచి రక్త ప్రవాహంలోకి చేరుతుంది. ఫలితంగా జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాల్మొనెల్లా టైఫి అనే బాక్టీరియా ద్వారా టైఫాయిడ్ వస్తుంది. ఈ జ్వరం తీవ్రత పెరిగే కొద్దీ లక్షణాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. అందువల్ల లక్షణాలు కనిపించగానే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. జ్వరం ఎక్కువయ్యే కొద్దీ వణుకు రావడం, లివర్ పెరగడం, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కొందరిలో కనిపిస్తాయి. ఇక కొందరిలో జ్వరం 104 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతకు చేరుతుంది. అయితే జ్వరం ఎంతకూ తగ్గకపోతే దాన్ని టైఫాయిడ్‌గా అనుమానించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.
టైఫాయిడ్ వచ్చిన వారు వైద్యులు ఇచ్చే మందులతోపాటు కింద తెలిపిన చిట్కాలు పాటించవచ్చు. దీంతో టైఫాయిడ్ నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.
1. ద్రవాలు
టైఫాయిడ్ వచ్చిన వారి శరీరంలో ద్రవాలు త్వరగా బయటకు పోతుంటాయి. డీహైడ్రేషన్ బారిన పడతారు. అందుకు గాను ఎక్కువగా ద్రవాలను తీసుకోవాలి. ముఖ్యంగా నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, సూప్స్ తాగాల్సి ఉంటుంది.
2. ఓఆర్ఎస్
టైఫాయిడ్ వచ్చిన వారు ఓఆర్ఎస్ ద్రావణాలను తాగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. కనుక మెడికల్ షాప్‌లలో వివిధ రకాల ఫ్లేవర్లలో దొరికే ఓఆర్ఎస్ ప్యాకెట్లను కొని తెచ్చి వాటిపై సూచించిన విధంగా ఓఆర్ఎస్ ద్రావణాలను కలుపుకుని తాగవచ్చు. లేదా ఒక లీటర్ మరిగించిన నీటిలో కొద్దిగా చక్కెర, ఉప్పు కలిపి కూడా తాగవచ్చు. దీంతో శరీరంలోకి మినరల్స్ చేరుతాయి. చురుకుదనం వస్తుంది.
3. తులసి
తులసి ఆకుల్లో యాంటీ బయోటిక్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల టైఫాయిడ్‌కు అవి అద్భుతంగా పనిచేస్తాయి. ఒక కప్పు నీటిలో నాలుగైదు తులసి ఆకులు వేసి కొద్దిగా మరిగించి ఆ నీటిని తాగాలి. రోజుకు ఇలా 4 సార్లు తాగితే మంచిది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. టైఫాయిడ్ తగ్గుతుంది.
4. వెల్లుల్లి
టైఫాయిడ్ వచ్చిన వారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. పరగడుపునే రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే ఫలితం ఉంటుంది.
5. అరటి పండ్లు
జ్వరం వచ్చిన వారు అరటి పండ్లను తినకూడదని కొందరు నమ్ముతారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే అరటి పండ్లలో పెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒక ఫైబర్. దీని వల్ల చిన్నపేగులు మనం తీసుకునే ద్రవాలను సరిగ్గా శోషించుకుంటాయి. ఫలితంగా విరేచనాలు అవకుండా ఉంటాయి. అలాగే అరటి పండ్లలో ఉండే పొటాషియం శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్స్ ను భర్తీ చేస్తుంది. దీంతో కూడా విరేచనాలు అవకుండా ఉంటాయి. టైఫాయిడ్ ఉన్నవారు అరటి పండ్లను తినడం మంచిది.
6. త్రిఫల చూర్ణం
సాధారణ జ్వరం లేదా టైఫాయిడ్ ఏది ఉన్నా సరే త్రిఫల చూర్ణం తీసుకుంటే ఫలితం ఉంటుంది. టైఫాయిడ్‌కు కారణం అయ్యే సాల్మొనెల్లా టైఫి బాక్టీరియా నశిస్తుంది. త్రిఫల చూర్ణం పొడి, ట్యాబ్లెట్ల రూపంలో లభిస్తుంది. డాక్టర్ సూచన మేరకు దీన్ని వాడుకోవాలి.
7. లవంగాలు
టైఫాయిడ్ ఉన్నవారు లవంగాలను తింటే బాక్టీరియా నాశనం అవుతుంది. ఒకటిన్నర కప్పు నీటిలో 3 లవంగాలు వేసి బాగా మరిగించాలి. తరువాత నీటిని వడకట్టి తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
8. దానిమ్మ పండ్లు
టైఫాయిడ్ జ్వరాన్ని తగ్గించేందుకు దానిమ్మ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. దీన్ని నేరుగా తినలేని వారు జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా దానిమ్మ పండ్లలో ఉండే ఔషధ గుణాలు టైఫాయిడ్‌ను, దాని లక్షణాలను తగ్గిస్తాయి.
ఇక ఇవే కాకుండా టైఫాయిడ్ వచ్చిన వారు ఆహారం విషయంలోనూ జాగ్రత్త వహించాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. శుభ్రంగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి. వేడిగా ఉన్న ఆహారాన్నే తినాలి. అలాగే నీటిని మరిగించి చల్లార్చి తాగాలి. జ్వరం బాగా ఉంటే చంకలు, పాదాలు, చేతులు, నుదురుపై తడిగుడ్డతో తుడుస్తుండాలి. జ్వరం తగ్గేవరకు మాటిమాటికీ ఇలా చేయాలి. దీంతో టైఫాయిడ్ నుంచి త్వరగా కోలుకుంటారు.