ఉలవలను ఇప్పుడంటే చాలా మంది తినడం మానేశారు. కానీ నిజానికి అవి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పవచ్చు. ఉలవలను కొందరు పచ్చడి చేసుకుంటారు. కొందరు చారు రూపంలో, ఇంకొందరు కూర రూపంలో తీసుకుంటారు. అయితే ఉలవల వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉలవలు పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు ఉపయోగపడతాయి.
1. పావు కప్పు ఉలవలను తీసుకుని వాటిని నాలుగు కప్పుల నీటిలో బాగా మరిగించాలి. నీళ్లు ఒక కప్పు అయ్యే వరకు మరిగించి కషాయం తయారు చేయాలి. దీన్ని ఉదయం, సాయంత్రం రెండు భాగాలుగా తీసుకోవాలి. పెసరకట్టుతో ఈ కషాయం కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. జ్వరంతోపాటు ఉండే నీరసం, నిస్సత్తువ తగ్గుతాయి. ఉలవలు శరీరానికి బాగా చెమట పట్టేలా చేస్తాయి. దీని వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది.
2. మనలో కొందరికి అధిక చెమట సమస్య ఉంటుంది. చెమట వారి శరీరం నుంచి నీటిలాగా బయటకు వస్తుంది. ఈ సమస్య ఉన్నవారు ఉలవలను కొద్దిగా వేయించి పొడిలా చేసుకోవాలి. దీన్ని నలుగుపిండిలా వాడుకోవచ్చు. అంటే కొద్దిగా నీటిలో కలిపి శరీరానికి బాగా పట్టించి కొంత సేపటి తరువాత స్నానం చేయాలి. ఇలా వారంలో 2, 3 సార్లు చేస్తే అధిక చెమట సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే శరీరం నుంచి చెమట వల్ల దుర్గంధం రాకుండా ఉంటుంది.
3. ఉలవలతో చేసిన కషాయాన్ని రోజుకు రెండు పూటలా తీసుకుంటుంటే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
4. ఉలవలను బాగా నూరి వాటిని ఒక భాగం, ఆవు నెయ్యి నాలుగు భాగాలు, వీటికి 16 రెట్ల నీటిని తీసుకుని అన్నింటినీ కలిపి బాగా మరిగించాలి. కేవలం నెయ్యి మాత్రమే మిగిలేలా మరిగించాలి. తరువాత వచ్చే మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు రెండు టీస్పూన్ల చొప్పున వేడి నీళ్లు లేదా వేడి పాలతో తీసుకోవాలి. దీన్ని 40 రోజుల పాటు తీసుకుంటే మూత్ర పిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.
5. ఉలవలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల స్త్రీలలో తలెత్తే హార్మోన్ సమస్యలు పోతాయి. రుతుక్రమం సరిగ్గా ఉంటుంది.
6. ముల్లంగి దుంపల చూర్ణం, ఉలవల చూర్ణం కలిపి ఒక టీస్పూన్ మోతాదులో నీటితో రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేస్తుంటే కొద్ది రోజులకు అర్శ మొలలు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365