Uric Acid : శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పేరుకుపోతే ఇబ్బందులు వస్తాయన్న సంగతి తెలిసిందే. యూరిక్ యాసిడ్ పేరుకుపోతే హైపర్‌యురిసిమియా వస్తుంది. దీంతో తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గౌట్, ఆర్థరైటిస్ వస్తాయి. ఇవి విపరీతమైన నొప్పులను కలగజేస్తాయి. మోకాళ్లు, కీళ్లు, పాదాల వేళ్ల మడతల్లో తీవ్రమైన నొప్పి, వాపు వస్తాయి. దీని వల్ల ఒకానొక దశలో నడవడమే కష్టమవుతుంది. ఇక యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం వల్ల కిడ్నీ స్టోన్లు కూడా ఏర్పడుతాయి. అయితే కింద చెప్పిన చిట్కాలను పాటిస్తే దాంతో యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజసిద్ధంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. శరీరంలో ఎక్కువగా ఉన్న యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు వస్తుంది. దీంతోపాటు జాయింట్లలో ఉండే యూరిక్ యాసిడ్ సైతం బయటకు పోతుంది. దీంతో నొప్పి, వాపులు తగ్గుతాయి. అలాగే సరైన పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు ఉండే ఆహారాలను తగ్గించాలి. మాంసం, పప్పులను తక్కువగా తీసుకోవాలి. లేదా సమస్య తగ్గే వరకు పూర్తిగా మానేయాలి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. కనుక ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం.
విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ, నారింజ పండ్లను, ద్రాక్ష, పైనాపిల్, క్యాప్సికం, కివి, స్ట్రాబెర్రీలను అధికంగా తింటే యూరిక్ యాసిడ్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయి. ఇక యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను తగ్గించుకోవాలంటే చక్కెర అధికంగా ఉండే పానీయాలను మానేయాలి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, పండ్ల రసాలను తీసుకోకూడదు. అలాగే మద్యం సేవించడం మానేయాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. బరువు తగ్గడం, సరైన జీవన విధానం పాటించడం, హెర్బల్ టీలను సేవించడం వంటివి చేస్తే మీ శరీరంలో ఉండే యూరిక్ యాసిడ్ సహజసిద్ధంగా కరిగిపోతుంది.