మనం ఆహారంలో భాగంగా తీసుకునే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. దీనిని మనం ఎంతో కాలంగా ఆహారంగా తీసుకుంటున్నాము. సొరకాయలతో పచ్చడి, పప్పు, కూర వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాం. సొరకాయలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. సులువుగా జీర్ణం కూడా అవుతుంది. మూత్ర నాళాల జబ్బులకు ఇది చక్కటి ఔషధంలా పని చేస్తుంది. పచ్చి సొరకాయను జ్యాస్ గా చేసుకుని తీసుకోవడం వల్ల అలసట తగ్గుతుంది. అధిక దాహం సమస్య నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
ఈ సొరకాయ ఎలాంటి నేలలోనైనా పెరుగుతుంది. ఇలాంటి సొరకాయలతో జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరిలోనూ ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఎన్ని మందులు, షాంపులు, హెయిర్ ఆయిల్స్ వాడినా ఉపయోగం లేకుండా పోతుంది. ఇలా జుట్టు రాలే సమస్య ఉన్న వారు సొరకాయ రసాన్ని తలకు పట్టించి అర గంట తరువాత తలస్నాం చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ విధంగా సొరకాయ రసాన్ని తరచూ ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా కూడా తయారవుతుంది.
సొరకాయతోపాటు జుట్టు రాలడం సమస్య ఉన్న వారు కొబ్బరి నూనెను లేదా బాదం నూనెను వేడి చేసి జుట్టుకు రాసుకోవాలి. తరువాత నూనె చర్మంలోకి ఇంకేలా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు గట్టిపడి జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించే మరికొన్ని పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన జుట్టుకు ఉపయోగపడే ఎంజైమ్ లు కలబందలో అధికంగా ఉంటాయి. కలబంద గుజ్జును తలకు రాసుకున్నా లేదా కలబంద రసాన్ని రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకున్నా కూడా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
గుడ్డు తెలసొన, పెరుగు మిశ్రమం కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. రెండు కోడి గుడ్ల తెల్లసొనను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనికి రెండు టీ స్పూన్ల తాజా పెరుగును కలపాలి. ఇలా తయారు చేసిన మిశ్రమానికి వేప ఆకుల పొడిని కలిపి జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతోపాటు ఇతర జుట్టు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ విధంగా పైన తెలిపిన చిట్కాలను వాడడం వల్ల జుట్టుకు సరైన పోషకాలు అంది జుట్టు రాలడం తగ్గడంతోపాటు జుట్టు నల్లగా, ఒత్తుగా, ఆరోగ్యవంతంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.