Left Over Curd For Hair And Skin : మనం ఆహారంగా తీసుకునే పాల పదార్థాల్లో పెరుగు కూడా ఒకటి. చాలా మందికి పెరుగుతో తిననిదే భోజనం చేసినట్టుగా ఉండదు. ఎన్ని రుచికరమైన వంటకాలతో తిన్నప్పటికి పెరుగుతో ఖచ్చితంగా తినాల్సిందే. పెరుగు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పెరుగును తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా అనేక రకాలుగా పెరుగు మనకు సహాయపడుతుంది. అయితే కొన్నిసార్లు మన ఇంట్లో పెరుగు ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిన పెరుగును ఏం చేయాలో తెలియక కొందరు పాడేస్తూ ఉంటారు. మరికొందరు దానిని రోజుల తరబడి ఫ్రిజ్ లో అలాగే ఉంచుతారు. అయితే ఎక్కవుగా మిగిలిన పెరుగును పడేయకుండా కింద చెప్పిన విధంగా చేయడం వల్ల మనం మిగిలిన పెరుగును చక్కగా వినియోగించుకోవచ్చు.
ఎక్కువగా మిగిలిన పెరుగును మరలా ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మిగిలిన పెరుగుతో మనం స్మూతీలను తయారు చేసుకోవచ్చు. పెరుగులో ఐస్ క్యూబ్స్, తేనె, చియా విత్తనాలు వేసి కలిపి స్మూతీలా కలిపి తీసుకోవచ్చు. ఇది రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలాగే చికెన్, మటన్ వంటి వాటితో వెరైటీలను తయారు చేసినప్పుడు వాటిని పెరుగులో మ్యారినేట్ చేస్తూ ఉంటాము. ఇలా మిగిలిన పెరుగుతో చక్కగా మ్యారినేట్ చేసుకుని వంటలు తయారు చేసుకోవచ్చు. ఇక చాలా మంది సలాడ్ వంటి వాటిని తింటూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. మిగిలిన పెరుగును సలాడ్ పై డ్రెస్సింగ్ గా కూడా ఉపయోగించవచ్చు. పెరుగులో నిమ్మరసం, హెర్బ్స్, ఆలివ్ నూనె, వెల్లుల్లి తరుగు వేసి సలాడ్ పై డ్రెస్సింగ్ చేసుకుని తినవచ్చు.
అదే విధంగా మిగిలిన పెరుగులో ఉప్పు, కారం, చాట్ మసాలా, హెర్బ్స్ వంటి వాటిని కలిపి డిప్ గా కూడా వాడుకోవచ్చు. చిప్స్, ఫింగర్స్, కూరగాయల ముక్కలను ఇలా తయారు చేసిన పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. ఇంట్లో పెరుగు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు దానితో రుచికరమైన లస్సీని తయారు చేసుకుని తాగవచ్చు. అలాగే వివిధ రకాల మసాలా వంటకాల్లో కూడా ఎక్కువగా మిగిలిన పెరుగును ఉపయోగించుకోవచ్చు. అలాగే పెరుగులో ఉల్లిపాయ ముక్కలు, కీరదోస ముక్కలు, కొత్తిమీర, టమాట ముక్కలు వేసి బిర్యానీ, పులావ్ వంటి వాటిలోకి రైతాగా తీసుకోవచ్చు.
అంతేకాకుండా ఎక్కువగా మిగిలిన పెరుగుతో జుట్టు మరియు చర్మం యొక్క సౌందర్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. మనం తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ లో పెరుగు వేసి జుట్టుకు పట్టించవచ్చు. పెరుగు జుట్టుకు మంచి కండిష్ నర్ గా పని చేస్తుంది. అలాగే మనం వాడే ఫేస్ ప్యాక్ లో పెరుగు వేసి ముఖానికి రాసుకోవచ్చు. చర్మానికి పెరుగును రాసుకోవడం వల్ల చర్మం అందంగా తయారవుతుంది. మొటిమలు, మచ్చలు తొలిగిపోతాయి. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. ఇంట్లో అధికంగా మిగిలిన పెరుగును పాడేయకుండా ఈ విధంగా అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు.