Lemon For Dandruff : మనల్ని వేధించే జుట్టు సంబంధిత సమస్యలల్లో చుండ్రు కూడా ఒకటి. మనలో ఆచలా మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. చుండ్రు కారణంగా తలలో ఎక్కువగా దురద ఉంటుంది. జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం, పొడి చర్మం వంటి వివిధ కారణాల చేత చుండ్రు సమస్య తలెత్తుతుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి జుట్టుకు నేరుగా నిమ్మరసాన్ని రాస్తూ ఉంటారు. అసలు నిమ్మరసం రాయడం వల్ల నిజంగా చుండ్రు సమస్య తగ్గుతుందా… దీని వల్ల జుట్టుకు ఎటువంటి ఏదైనా ప్రమాదం కలుగుతుందా… జుట్టుకు నిమ్మరసాన్ని రాసుకోవచ్చా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసంలో యాంటీఇన్ ప్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చుండ్రు సమస్యతో బాధపడే వారు తలకు నిమ్మరసాన్ని రాసుకోవడం వల్ల చుండ్రు సమస్య, దురద తగ్గుతుంది. దీనిలో ఉండే యాంటీఇన్ ప్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రును తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. నిమ్మరసం రాసుకోవడం వల్ల జుట్టుకు ఎటువంటి హాని కలగదు. చుండ్రు సమస్యతో బాధపడే వారు తల చర్మానికి నిమ్మరసాన్ని రాసుకుని 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. అయితే నిమ్మరసం రాసినప్పుడు దానిలో ఉండే ఆమ్లతత్వం కారణంగా తల చర్మంపై మంటగా ఉంటుంది. అలాగే నిమ్మరసం వల్ల ఏదైనా ఇబ్బంది ఉన్నవారు దీనిని నేరుగా రాయడానికి బదులుగా దీనిలో కొబ్బరి నూనె కలిపి రాసుకోవచ్చు.
ఒక టీ స్పూన్ నిమ్మరసంలో, ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించడం వల్ల నిమ్మరసం గాఢత తగ్గి మంట లేకుండా ఉంటుంది. ఇక ఈ చుండ్రు సమస్య మరలా రాకూడదు అనుకున్న వారు వేడి నీటితో తలస్నానం చేయకూడదు. వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల తలచర్మం పొడిబారుతుంది. జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. కనుక గోరువెచ్చని నీటితో లేదా చల్లటి నీటితో తలస్నానం చేయాలి. అలాగే చుండ్రు సమస్యతో బాధపడే వారు రోజూ తలస్నానం చేయాలి. వేళ్లతో తలచర్మాన్ని బాగా రుద్దుతూ తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య త్వరగా తగ్గుతుంది. రోజూ తలస్నానం చేయడం వల్ల తలలో చెమట లేకుండా ఉంటుంది. గాలిలో ఉండే బ్యాక్టీరియాలు తలచర్మంపై పేరుకుపోకుండా ఉంటాయి. ఇన్పెక్షన్స్ రాకుండా ఉంటాయి. నశించిన చర్మ కణాలు తొలగిపోతాయి. చుండ్రు, దురద సమస్య రాకుండా ఉంటుంది. అయితే తలస్నానంచేసిన ప్రతిసారి షాంపును వాడాల్సిన అవసరం లేదు. వారానికి ఒకసారి లేదా రెండు సార్లు షాంపును వాడవచ్చు.