Loose Motions : వర్షాకాలంలో సహజంగానే ఎక్కడ చూసినా బాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిములు ఉంటాయి. దీంతో మనకు ఈ సీజన్‌లో వ్యాధులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో ముఖ్యంగా చాలా మందికి లూజ్ మోషన్స్ అవుతుంటాయి. పడని ఆహారం తిన్నా, ఫుడ్ పాయిజనింగ్ అయినా, నిల్వ ఉంచిన ఆహారం తిన్నా, బయటి ఆహారం తిన్నా.. కొందరికి నీళ్ల విరేచనాలు అవుతాయి. అయితే ఇందుకు మెడిసిన్ వాడాల్సిన పనిలేదు. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు.. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
లూజ్ మోషన్స్ అవుతుంటే శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ కూడా బయటకు వెళ్లిపోతాయి. దీంతో నీరసం అవుతుంది. మనం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి పొందాలంటే అందుకు నిమ్మకాయ నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి. ఒక గ్లాస్‌లో నిమ్మకాయ పిండి అందులో కాస్త చక్కెర, ఉప్పు కలిపి తాగాలి. దీంతో మన శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి పొందుతుంది. దీని వల్ల నీరసం తగ్గుతుంది. ఇక మోషన్స్ తగ్గాలంటే అందుకు అరటి పండు ఎంతగానో పనిచేస్తుంది. అరటి పండును తినడం వల్ల విరేచనాలు సులభంగా కట్టుకుంటాయి. అరటి పండులో ఉండే కార్బొహైడ్రేట్లు విరేచనాలకు అడ్డుకట్ట వేస్తాయి. అయితే అరటి పండు మరీ పండినది కాకుండా కాస్త పచ్చిగా ఉన్నది తింటే మేలు.
ఇక నారింజ, ద్రాక్ష వంటి పండ్లను తింటున్నా కూడా నీళ్ల విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పెరుగులో మన శరీరానికి మేలు చేసే మంచి బాక్టీరియా ఉంటుంది. దీన్నే ప్రోబయోటిక్స్ ఆహారం అంటారు. అందువల్ల విరేచనాలు అయినప్పుడు జీర్ణవ్యవస్థలో ఉండే చెడు బాక్టీరియాను అంతం చేసేందుకు మంచి బాక్టీరియాను పెంచాలి. ఇది పెరుగుతో సాధ్యమవుతుంది. పెరుగును తినడం వల్ల మంచి బాక్టీరియా పెరిగి చెడు బాక్టీరియా నశిస్తుంది. దీంతో విరేచనాలు త్వరగా తగ్గుతాయి. అలాగే గంజి నీళ్లు, పెసలు, కిచిడీ, పెరుగు అన్నం వంటివి తినడం వల్ల విరేచనాల నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. అయితే విరేచనాలు తగ్గేవరకు కారం, మసాలాలు, మాంసాహారం, నూనె పదార్థాలను తీసుకోకూడదు.