Natural Tonic : వాతావరణ మార్పుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యల బారిన పడడం ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణమైపోయింది. వర్షాకాలంలో అదే విధంగా శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి ఇన్ ఫెక్షన్ ల బారిన ఎక్కువగా పడుతుంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి ఇన్ ఫెక్షన్ ల బారి నుండి బయటపడడానికి ఎక్కువగా యాంటీ బయాటిక్స్ ను ఉపయోగిస్తుంటారు. కానీ ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు కూడా మందులు వాడడం మన శరీరానికి అంత మంచిది కాదు. ఇలా తరచూ ముందులను వాడడం వల్ల మన శరీరం వ్యాధులను అడ్డుకునే శక్తిని క్రమంగా కోల్పోతూ ఉంటుంది.
ఇంటి చిట్కాలను ఉపయోగించి సహజసిద్ధంగా మనం ఈ ఇన్ ఫెక్షన్ ల బారి నుండి బయటపడవచ్చు. ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక టానిక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి నీటిని వేడి చేయాలి. తరువాత ఈ నీటిలో 10 నల్ల మిరియాలను, 4 లవంగాలను, అర టీ స్పూన్ వామును, ఒక టీ స్పూన్ శొంఠి పొడిని, 4 తులసి ఆకులను , అర టీ స్పూన్ పసుపును, 2 యాలకులను, కొద్దిగా బెల్లాన్ని వేసి అన్నీ కలిసేలా కలపాలి. తరువాత ఈ నీటిని అర గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించాలి.
ఇలా మరిగించిన తరువాత నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇన్ ఫెక్షన్ లను తరిమి కొట్టే టానిక్ తయారవుతుంది. ఈ టానిక్ ను మూడు పూటలా మూడు భాగాలుగా చేసి తీసుకోవాలి. ఈ టానిక్ ను తీసుకున్న ప్రతిసారి అది గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు మాత్రం ఈ టానిక్ ను రెండు పూటలా మాత్రమే ఇవ్వాలి. ఇలా తయారు చేసుకున్న టానిక్ ను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇన్ ఫెక్షన్ ల బారి నుండి బయట పడవచ్చు. ఇందులో ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా మన శరీరానికి ఎంతో మేలు చేసేవే. ఇలా టానిక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల చాలా త్వరగా మనకు జలుబు, దగ్గు వంటి ఇన్ ఫెక్షన్ ల బారి నుండి ఉపశమనం కలుగుతుంది.