Mango Leaves : మామిడిపండ్లను మనం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాము. మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. మామిడి పండ్లను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని సంగతి మనకు తెలిసిందే. కేవలం మామిడి పండ్లే కాకుండా మామిడి ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకులను మనం ఎక్కువగా ఇంటి గుమ్మానికి తోరణాలుగా కట్టడానికి ఉపయోగిస్తూ ఉంటాము. కేవలం తోరణాలుగానే కాకుండా ఔషధంగా కూడా మనం మామిడి ఆకులను ఉపయోగించవచ్చు. ఈ ఆకులు లేతగా ఉన్నప్పుడు ఎరుపు లేదా ఊదా రంగులో ఉంటాయి. ఆకులు పెద్దవయ్యే కొద్ది ముదురు ఆకుపచ్చ రంగులోకి మారతాయి.
మామిడి ఆకుల్లలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. అలాగే ప్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫినాల్స్ కూడా అధికంగా ఉంటాయి. లేత మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. మామిడి ఆకులతో కషాయాన్ని చేసుకుని తాగవచ్చు. అలాగే ఈ ఆకుల పొడిని ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా రాత్రంతా మామిడి ఆకులను నీటిలో వేసి అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి తాగాలి. ఇలా తాగడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మామిడి ఆకుల వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.
లేత మామిడి ఆకుల్లో ఆంథోసైనిడిన్స్ అనే టానిన్లు ఉంటాయి. ఇవి మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో దోహదపడతాయి. మామిడిఆకులను ఒక కప్పు నీటిలో వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి తాగాలి. ఇలా తాగడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే మామిడి ఆకులు హైపోటెన్సివ్ లక్షణాలను కలిగి ఉన్నాయి. కనుక వీటిని వాడడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే స్నానం చేసే నీటిలో మామిడి ఆకులను వేసి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీర బడలిక తగ్గుతుంది. ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
అలాగే మూత్రపిండాల్లో రాళ్లు, పిత్తాశయంలో రాళ్ల సమస్యతో బాధపడే వారు మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల జలుబు, దగ్గు, బ్రాంకైటిస్, ఆస్థమా వంటి సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. మామిడి ఆకుల కషాయంలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. అదే విదంగా మామిడి ఆకుల పొడిని నీటిలో కలిపి రోజుకు రెండు నుండి మూడు సార్లు తీసుకోవడం వల్ల డయేరియా తగ్గు ముఖం పడుతుంది. అలాగే మామిడి ఆకుల నుండి రసాన్ని తీసి గోరు వెచ్చగా అయ్యే వరకు వేడి చేయాలి.
ఈ రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కల మోతాదులో చెవిలో వేసుకోవడం వల్ల చెవి నొప్పి తగ్గుతుంది. ఎక్కిళ్లు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు మామిడి ఆకులను మండించగా వచ్చిన పొగను పీల్చుకోవడం వల్ల ఎక్కిళ్లు, గొంతు సమస్యలు తగ్గుతాయి. అలాగే రాత్రిపడుకునే ముందు వేడి నీటిలో మామిడి ఆకులను వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా మామిడి ఆకులు కూడా మనకు ఎంతగానో సహాయపడతాయని వీటిని ఉపయోగించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.