గ్యాస్, అసిడిటీ, గుండెల్లో మంట.. సమస్య ఏదైనా సరే.. ఇవి వచ్చాయంటే.. ఒక పట్టాన మనశ్శాంతి ఉండదు. ఏ పనీ చేయబుద్ది కాదు. మరోవైపు ఏది తిందామన్నా.. తాగుదామన్నా.. గుండెల్లో ఏదో పట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ సమస్యలను నిత్య జీవితంలో చాలా మంది ఎదుర్కొంటుంటారు. దీంతో వారు ఇంగ్లిష్ మెడిసిన్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఆ అవసరం లేకుండానే మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే పై సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదెలాగంటే…
1. గ్యాస్, అసిడిటీ, గుండెల్లో మంట.. ఏదైనా సరే.. నీటిని బాగా తాగుతుండాలి. దీంతో జీర్ణాశయంలో అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ల ప్రభావం కొంత వరకు తగ్గి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమస్యలు తగ్గే వరకు నీటిని బాగా తాగాలి. 2. గ్యాస్, అసిడిటీ సమస్య ఉన్నవారు పడుకోరాదు. ఎంత సేపు వీలైతే అంత సేపు కూర్చుని ఉండాలి. దీంతో గ్యాస్ పైకి రాకుండా ఉంటుంది. అదే పడుకుంటే గ్యాస్ పైకి వస్తుంది. దీంతో సమస్య మరింత ఎక్కువవుతుందే తప్ప తగ్గదు. 3. గ్యాస్ సమస్య ఉన్నవారు పైనాపిల్ జ్యూస్ తాగడం ద్వారా ఆ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.
4. అలోవెరా (కలబంద) జ్యూస్‌ను తాగినా పై మూడు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 5. గ్యాస్, గుండెల్లో మంటగా ఉంటే.. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను కలుపుకుని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 6. ఒక గ్లాస్ నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పూర్తిగా పిండి తాగితే గ్యాస్ నుంచి తక్షణమే రిలీఫ్ లభిస్తుంది. 7. ఒక గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలుపుకుని తాగినా గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. 8. గుండెల్లో మంటగా ఉన్నవారు యాపిల్, అరటి లేదా ద్రాక్ష పండ్లను తింటే వెంటనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. 9. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ పుదీనా రసం కలుపుకుని తాగినా పై మూడు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 10. అసిడిటీ, గుండెల్లో మంటగా ఉన్నవారు ఒక గ్లాస్ చల్లని మజ్జిగ తాగితే సమస్య నుంచి బయట పడవచ్చు.