శారీరక, మానసిక వ్యాధులు, రోజూ ఒత్తిడికి గురవడం, వాతావరణంలో మార్పులు, మధ్యాహ్నం అతిగా నిద్రించడం, ఆహారపు అలవాట్లలో మార్పులు, అతిగా భోజనం చేయడం, టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, కీళ్ల నొప్పులు, మధుమేహం.. తదితర అనేక కారణాలు, సమస్యల వల్ల నిద్రలేమి వస్తుంటుంది. అలాగే శరరీంలో నీటి శాతం బాగా తగ్గినా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే నిద్రలేమి సమస్యకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలేమి సమస్య ఉన్నవారు మధ్యాహ్నం నిద్రించరాదు, అంతగా కావాలంటే 30 నిమిషాల పాటు చిన్న కునుకు తీయాలి. అంతే. మధ్యాహ్నం ఎక్కువ సేపు నిద్రించరాదు. అయితే గర్భిణీలు, వృద్ధులు మధ్యాహ్నం నిద్రించవచ్చు. ఇక వ్యాయామం చేసిన వెంటనే కాకుండా ఒక గంట సేపు అయ్యాక నిద్రిస్తే మంచిది.
నిద్రలేమితో బాధపడేవారు పాలు, పెరుగు, చెరుకు రసం, అరటి పండ్లు, యాపిల్ పండ్లు, నారింజ, దానిమ్మ వంటి వాటిని తీసుకుంటే మేలు కలుగుతుంది. అలాగే శరీరాన్ని నూనెతో మసాజ్ చేసి గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. నూనెతో తలకు బాగా మర్దనా చేసుకోవాలి. దీంతో హాయిగా నిద్ర పడుతుంది.
అరికాళ్లలో లావెండర్ నూనె లేదా తేనెతో బాగా మర్దనా చేయాలి. దీని వల్ల కూడా నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్ అశ్వగంధ చూర్ణం కలిపి రోజూ రాత్రి పూట పడుకునేందుకు 2 గంటల ముందు తాగాలి. దీంతో నిద్ర బాగా పడుతుంది.
రాత్రి భోజనం చేసిన తరువాత పాలలో చిటికెడు జాజికాయ చూర్ణం లేదా బాదంపప్పు, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి వేసి బాగా కలిపి తాగాలి. దీంతో నిద్ర బాగా వస్తుంది. అలాగే గసగసాలను వస్త్రంలో కట్టి వాసన పీల్చాలి. దీని వల్ల కూడా నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
రాత్రిపూట జాజిపూలను దిండు కింద పెట్టుకుంటే నిద్ర బాగా వస్తుంది. జాజిపూల తైలం లేదా బాదం నూనెతో తలకు మర్దనా చేసుకోవాలి. దీని వల్ల కూడా నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365