Nuli Purugulu : నిమ్మకాయ.. ఇది మనందరికి తెలిసిందే. నిమ్మరసాన్ని మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. నిమ్మరసంలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయని నిమ్మరసాన్ని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని మనందరికి తెలిసిందే. అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నిమ్మకాయలోనే కాదు నిమ్మ ఆకుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. నిమ్మాకుల్లో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. నిమ్మాకు యాంటీ సెప్టిక్ గా కూడా పని చేస్తుంది. ఔషధాల తయారీలో కూడా నిమ్మాకులను విరివిరిగా ఉపయోగిస్తారు. తలనొప్పితో బాధపడతున్నప్పుడు నిమ్మాకుల వాసనను చూడడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
అలాగే ఈ ఆకుల వాసనను చూడడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. నరాల సంబంధిత వ్యాధులను, నిద్రలేమిని, మైగ్రేన్ తలనొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో నిమ్మ ఆకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుగా మనం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక 10 నిమ్మ ఆకులను శుభ్రంగా కడిగి వేయాలి. తరువాత గిన్నె మీద మూతను ఉంచి పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా చేయడం వల్ల నిమ్మాకుల టీ తయారవుతుంది. ఈ టీ ని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసిన టీ ని ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మైగ్రేన్ తలనొప్పి, డిప్రేషన్ వంటివి తగ్గు ముఖం పడతాయి.
ఈ టీ ని తాగడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు, శ్వాస కోస సంబంధిత సమస్యల వంటివి కూడా నయం అవుతాయి. దగ్గు, జలుబు, గొంతులో ఇన్ఫెక్షన్ వంటివి కూడా తగ్గుతాయి. కడుపునొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు, కండరాలలో తిమిర్లు వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా నిమ్మాకులతో చేసిన టీ మనకు ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ కడుపులో ఉండే క్రిములను నశింపజేస్తుంది. కడుపులో నులిపురుగులను నివారించే గుణం కూడా నిమ్మాకులకు ఉంది. ఈ సమస్యతో బాధపడే వారు నిమ్మాకుల నుండి తీసిన రసంలో తేనెను కలిపి తీసుకోవాలి. చిన్న పిల్లలకు కూడా దీనిని ఇవ్వవచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగులు నశిస్తాయి. ఈ చిట్కాను 5 నుండి 10 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించాలి.
బరువు తగ్గాలనుకునే వారు నిమ్మాకులతో చేసిన టీ ని తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ టీని రోజుకు రెండు పూటలా తాగడం వల్ల ఉబ్బసం తగ్గుతుంది. నిమ్మాకులను, లవంగాలను కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న పన్నుపై ఉంచడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నిమ్మాకులను, ఉప్పును కలిపి మెత్తగా నూరాలి. తరువాత దానిలో బేకింగ్ సోడాను కలిపి దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా మారడంతో , నోటి దుర్వాసన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మలబద్దకం, అజీర్తి వంటి వాటితో బాధపడే వారు నిమ్మాకులతో చేసిన టీ ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా నిమ్మాకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని వాడడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.