Swelling Remedies : మన శరీరంలో చేతులు, కాళ్లు, ముఖం అప్పుడప్పుడూ వాపుకు గురి అవుతూ ఉంటుంది. చాలా మంది ఇలా వాపులు కనిపించగానే కంగారు పడి పోతుంటారు. శరీరంలో ఇలా వాపులు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మన శరీరంలో సోడియం ఎక్కువైనప్పుడు శరీరంలో వాపులు జరుగుతుంది. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, నీళ్లు తక్కువగా తాగడం వంటి కారణాల చేత శరీరంలో సోడియం శాతం ఎక్కువవుతుంది. సోడియం మోతాదు ఎక్కువవడం వల్ల శరీరంలో వాపులు, నొప్పులు వస్తూ ఉంటాయి. ఎటువంటి అనారోగ్య సమస్య లేకున్నా కూడా శరీరంలో వాపులు కనిపిస్తూ ఉంటాయి. మనం మన శరీరానికి తగినంత ఉప్పును మాత్రమే తీసుకోవాలి. 11 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా రోజుకు 5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువగా తీసుకోకూడదు.
ఉప్పును అధికంగా తీసుకోవగడం వల్ల హైపర్ టెన్షన్ తో పాటు ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ హైపర్ టెన్షన్ సమస్య కనుక దీర్ఘకాలంగా కొనసాగితే గుండె సంబంధిత సమస్యలు, మూత్రపిండాల సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కనుక ఉప్పును తక్కువగా తీసుకుంటూ, నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు చేతుల్లో వాపు రావడాన్ని గమనించవచ్చు. కాలేయ సమస్యలతో బాధపడే వారు పొట్ట భాగంలో వాపును చూడవచ్చు. మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు కాళ్లల్లో, ముఖంలో వాపు రావడాన్ని గమనించవచ్చు.
ఇక ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే కనుక శరీరం మొత్తంలో వాపులు వస్తాయి. అదేవిధంగా అధిక బరువు వల్ల, రోజంతా కూర్చొని పని చేయడం వల్ల కూడా వాపులు వస్తూ ఉంటాయి. కనుక రోజంతా కూర్చొని పని చేసే వారు అప్పుడప్పుడూ లేచి అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. గర్భిణీ స్త్రీలల్లో కూడా మనకు వాపులు కనిపిస్తాయి. సరైన సమయానికి భోజనం చేయకపోయిన, శరీరంలో ఎటువంటి సర్జరీలు జరిగినా కూడా వాపులు వస్తూ ఉంటాయి. ఈ విధంగా వాపులు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ వాపులను ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం తగ్గించుకోవచ్చు. వాపులను తగ్గించడంలో ధనియాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ ధనియాలను వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం పూట ఈ నీటిని ధనియాలతో సహా ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించి వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం పూట ధనియాల కషాయాన్ని తాగడం వల్ల శరీరంలోని వాపులను సులభంగా తగ్గించుకోవచ్చు. ధనియాల కషాయం మన శరీరంలో అధికంగా ఉన్న నోటిని బయటకు పంపించడంలో ఎంతగానో సహాయపడుతుంది. దీంతో శరీరంలో ఉన్న వాపులన్నీ తగ్గిపోతాయి. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో ఉన్న అలాగే మూత్రపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ తొలగిపోతాయి. ఈ ధనియాల కషాయాన్ని తాగడం వల్ల వాపులు తగ్గడంతో పాటు మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
బీపీని తగ్గించడంలో, షుగర్ ను నియంత్రించడంలో మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఈ కషాయం ఎంతో సహాయపడుతుంది. ఈ కషాయాన్ని తాగడంతో పాటు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఒక బకెట్ లో గోరు వెచ్చటి నీటిని తీసుకోవాలి. ఒక బకెట్ లో చల్లటి నీటిని తీసుకోవాలి. ముందుగా వేడి నీటిలో ఒక మూడు నిమిషాల పాదాలను ఉంచాలి. తరువాత మరో మూడు నిమిషాల పాటు చల్లటి నీటిలో ఉంచాలి. ఇలా పాదాలను వేడి నీటిలో, చల్లటి నీటిలో రోజూ 20 నిమిషాల పాటు ఉంచడం వల్ల పాదాల వాపులు తగ్గుతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల శరీరంలో ఉన్న వాపులను సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలు వాడినప్పటికి వాపులు తగ్గకపోతే వైద్యున్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి.