Swollen Uvula Home Remedies : మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఒక్కో అవయవం ఒక్కో విధిని నిర్వహిస్తుంది. అవి మన దేహంలో ఉన్న అవయవాల్లో పలు అవయవాల వల్ల కలిగే ఉపయోగం గురించి మనకు తెలియనే తెలియదు. అటువంటి అవయావాల్లో కొండ నాలుక ఒకటి. మనం నిత్యం ఘన,ద్రవ పదార్థాలను ఆహారంగా తీసుకుంటాం. వాటన్నింటిని ఆహార నాళం ద్వారా జీర్ణాశయంలోకి సరిగ్గా వెళ్లేలా కొండనాలుక దారి చూపుతుంది. మనం స్వరపేటిక ద్వారా సరిగ్గా మాట్లాడేలా కొండనాలుక సహాయపడుతుంది. మనం బాగా మాట్లాడేటప్పుడు ఒక్కోసారి దగ్గు వస్తుంది. కొండనాలుక పొడి బారడం వల్ల ఈ దగ్గు వస్తుంది.
అందుకే ఎక్కువగా మాట్లాడే వారు మధ్య మధ్యలో నీటిని తాగుతూ ఉంటారు. మనం తీసుకున్న ఆహార పదార్థాల ద్వారా మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అనారోగ్యాన్ని తెలియజేయడానికి కూడా ఈ కొండనాలుక అవసరం అవుతుంది. అందుకే మనమందరం ఈ నాలుక పట్ల శ్రద్ధ తీసుకోవాలి. కొండనాలుక కూడా బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ లబారిన పడుతుంది. కొండనాలుక వాపు, ఎర్రగా అవ్వడం, గొంతునొప్పి లక్షణాలను బట్టి ఇది ఇన్ఫెక్షన్ బారిన పడినట్టు మనం గుర్తించాలి. కొందరిలో కొండనాలుక పొడుగ్గా కూడా అవుతుంది. కొండనాలుక పెరగడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది మరీ ఎక్కువైనప్పుడు ఒక్కోసారి గుటక వేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఈ సమస్య బారినప్పుడు ముందుగా వైద్యున్ని సంప్రదించాలి. సమస్య తీవ్రతను బట్టి, ఇన్ఫెక్షన్ ను బట్టి వైద్యుల మందులు సూచిస్తారు. అలాగే ఈ సమస్య బారినప్పుడు శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా నీటిని, సూప్ లను ఎక్కువగా తీసుకోవాలి. పండ్లను కూడా ఎక్కువగా తింటూ ఉండాలి.
అలాగే పలు రకాల చిట్కాలను పాటించడం వల్ల కొండనాలుక వాపును, ఇతర సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొండ నాలుక వాపునకు గురైనా, పొడవుగా పెరిగినా, ఇన్ఫెక్షన్ బారిన పడినా.. అందుకు అల్లం రసం పనిచేస్తుంది. ఒక టీస్పూన్ అల్లం రసంలో అంతే మోతాదులో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పూటకు ఒకసారి చొప్పున రోజుకు మూడు సార్లు తాగాలి. దీంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది. అల్లం, తేనెలలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల కొండనాలుక సమస్యలు త్వరగా తగ్గుతాయి. అలాగే కొండనాలుక సమస్యలను తగ్గించడంలో తులసి ఆకులు కూడా బాగానే పనిచేస్తాయి. పూటకు మూడు తులసి ఆకులను నములుతున్నా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.
పసుపులో యాంటీ బయోటిక్ గుణాలు అధికంగా ఉంటాయి. కనుక కొండ నాలుక వాపు తగ్గుతుంది. అందుకు గాను ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో పావు టీస్పూన్ పసుపును కలిపి రోజుకు 2 సార్లు తాగాలి. దీంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే పూటకు ఒక వెల్లుల్లి రెబ్బను తింటున్నా కొండనాలుక సమస్యల నుంచి బయట పడవచ్చు. గోధుమ గడ్డి జ్యూస్ కూడా బాగానే పనిచేస్తుంది. రోజుకు రెండు సార్లు 30 ఎంఎల్ చొప్పున గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగాలి. ఇది కూడా ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. కనుక కొండ నాలుక వాపు తగ్గుతుంది. ఇలా డాక్టర్లు ఇచ్చే మందులతోపాటు ఈ చిట్కాలను పాటించడం వల్ల కొండ నాలుక వాపు నుంచి సులభంగా బయట పడవచ్చు.