Ginger : మనం నిత్యం వంటల్లో వాడే పదార్థాల్లో అల్లం కూడా ఒకటి. అల్లాన్ని వాడడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. అల్లంలో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. భారతీయ సాంప్రదాయ వైద్యంలో అల్లాన్ని ఎంతోకాలంగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అల్లాన్ని వాడడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తరుచూ అల్లం రసాన్ని తాగుతూ ఉండడం వల్ల పైత్య వికారాలు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ రసాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

దగ్గు, కఫం వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారు అల్లానికి, ఉప్పును కలుపుకుని తినడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. అల్లాన్ని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అల్లాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి రక్త సరఫరా మెరుగుపడుతుంది.
రక్తాన్ని శుద్ధి చేసే గుణాన్ని కూడా అల్లం కలిగి ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు తరచూ అల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. నీటిలో అల్లాన్ని వేసి మరిగించి ఆ నీటిని వడకట్టుకుని తరచూ తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. అల్లాన్ని నమిలి తినడం వల్ల దంతాల ఆరోగ్యం మెరుగుపడడంతోపాటు నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. అధిక బరువుతో బాధపడే వారు అల్లం రసంలో నిమ్మ రసాన్ని కలుపుకుని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. ఈ రసాన్ని తాగడం వల్ల చర్మం కూడా నిగారింపును సొంతం చేసుకుంటుంది.
అల్లం రసంలో దూదిని ముంచి మొటిమలు, నల్ల మచ్చలు ఉన్న చోట రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎండబెట్టిన అల్లాన్ని శొంఠి అంటారు. ఈ శొంఠిని అన్నం మొదటి ముద్దలో కలుపుకుని తినడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. అల్లం టీ ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ టీ ని తాగడం వల్ల అజీర్తి, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. ఈ విధంగా మనకు అల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని ఏవిధంగా తీసుకున్నా కూడా మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.