Milk : ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నారు. డబ్బు కోసం కష్టపడడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఈ డబ్బును సంపాదించే క్రమంలో నిత్యం ఏదో ఒక సమయంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. డబ్బు సంపాదించే క్రమంలో ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోని వారు చాలా మందే ఉన్నారు. ఆహారాన్ని సరిగ్గా తీసుకోకపోవడం, పోషకాహార లోపం, మానసిక సమస్యలు, ఆందోళన వంటి అనేక కారణాల వల్ల కొందరు తరచూ నీరసంతో బాధపడుతున్నారు.
అలాగే చాలా సేపు కూర్చొని పనిచేయడం వల్ల నడుము నొప్పి, కండరాల నొప్పి కారణంగా కొందరు ఎప్పుడు చూసినా నీరసంగా, అలసటగా కనిపిస్తూ ఉంటారు. చాలా మంది ఇటువంటి కారణాల వల్ల ఏ పని చేయలేక అలాగే చేయడానికి ఉత్సాహం కూడా చూపించలేకపోతున్నారు. ఇటువంటి సమస్యలతో బాధపడే వారికి ఆయుర్వేదంలో ఒక మంచి చిట్కా ఉంది. ఈ చిట్కాను పాటించడం వల్ల నీరసం, అలసట తగ్గి రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారు. శరరీంలో అలసటను, నీరసాన్ని తగ్గించే ఆ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తరచూ నీరసం, అలసట వంటి సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించి రోజంతా చక్కగా పనులను చేసుకోగలుగుతారు. ఈ చిట్కా కోసం ఉపయోగించే పదార్థాల్లో ముఖ్యమైనవి గసగసాలు. గసగసాలను మనం వంటింట్లో తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. ఆయుర్వేదంలో కూడా వీటిని ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు. గసగసాల్లో అధికంగా ఉండే ఫైబర్ అజీర్తి, గ్యాస్, మలబద్దకం, అసిడిటీ వంటి సమస్యలను నయం చేయడంలో ఉంతగానో ఉపయోగపడుతుంది. అలాగే వీటిలో ఉండే ఇతర పోషకాలు శరీరానికి తగినంత శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి.
మన శరీరంలో అలసటను, నీరసాన్ని దూరం చేసే ఈ గసగసాలను మనం రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. గసగసాలను పాలతో, పెరుగుతో కలిపి మనం వాడవచ్చు. ముందుగా పాలతో గసగసాలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాసులో గోరు వెచ్చని పాలను తీసుకోవాలి. తరువాత ఈ పాలతో ఒక టేబుల్ స్పూన్ గసగసాలను వేసి కలపాలి. తరువాత ఇందులోనే రెండు లేదా మూడు వాల్ నట్స్ ను తీసుకుని ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత వీటిని పాలలో 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా నానిన తరువాత గసగసాలను, వాల్ నట్స్ ను తింటూ పాలను తాగాలి. ఈ చిట్కాను రాత్రి పడుకునే ముందు పాటించాలి.
ఈ విధంగా పాలతో గసగసాలను తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. అలాగే శరీరంలో ఉన్న నీరసం, నిస్సత్తువ తొలగిపోయి ఉత్సాహంగా రోజంతా పని చేయగలుగుతారు. ఇప్పుడు పెరుగుతో గసగసాలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక కప్పు పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో కూడా ఒక టేబుల్ స్పూన్ గసగసాలను, 2 లేదా 3 వాల్ నట్స్ ను ముక్కలుగా చేసి చేసుకోవాలి. తరువాత దీనిలో కండచక్కెరను కానీ, తేనెను కానీ వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని నేరుగా తినాలి. ఈ చిట్కాను ఉదయం అల్పాహారం చేసిన తరువాత పాటించాలి.
ఉదయం పూట ఇలా గసగసాలు కలిపిన పెరుగును తినడం వల్ల అలసట, నీరసం మన దరి చేరకుండా ఉంటాయి. గసగసాలు, పెరుగు, పాలు, వాల్ నట్స్.. ఇవి అన్నీ కూడా మన శరీరానికి మేలు చేసేవే. వీటిల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. గసగసాలను ఈ విధంగా తీసుకోవడం వల్ల అలసట, నీరసం తగ్గుతాయి. అంతేకాకుండా వీటి కారణంగా వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయి.