Urinary Tract Infection Remedies : మనల్ని వేధించే మూత్రాశయ సంబంధిత సమస్యల్లో యూరినరీ ట్రాక్ ఇన్పెక్షన్స్( యుటిఐ) కూడా ఒకటి. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లో వస్తుంది. అపరిశుభ్రత, మూత్రపిండాల్లో రాళ్లు, యాంటీ బయాటిక్స్ ను ఎక్కువగా వాడడం, మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి వివిధ కారణాల చేత ఈ ఇన్పెక్షన్స్ తలెత్తుతాయి. యుటిఐ బారిన పడినప్పుడు పొత్తి కడుపులో నొప్పి, మూత్రంలో మంట, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లడం వంటి సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్పెక్షన్ ల సమస్య సాధారణమైనదే అయినప్పటికి తరుచూ ఈ సమస్య బారిన పడడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
ఈ సమస్యకు అనేక రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే కొన్ని చిట్కాలను పాటిస్తూ మనం తీసుకునే ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం సమస్య బారిన పడకుండా ఉండవచ్చు. యూటిఐ సమస్యతో బాధపడే వారు నీటిని ఎక్కువగా తాగాలి. నీరు తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలతో పాటు మూత్రనాళంలో ఉండే బ్యాక్టీరియా కూడా బయటకు తొలగిపోతుంది. అలాగే ఈ సమస్యతో బాధపడే వారు కాఫీ,టీ లను తీసుకోవడం తగ్గించాలి. కాఫీ, టీ లు ఈ ఇన్పెక్షన్ ను మరింత ఎక్కువగా పెంచుతాయి. అదే విధంగా యూటిఐ తో బాధపడే వారు ఫైబర్, ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడ వల్ల శరీరంలో ఉండే హానికారక బ్యాక్టీరియా నశిస్తుంది. అలాగే అరటిపండ్లు, గింజలు, తృణ ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా చేపలను ఎక్కువగా తీసుకోవాలి.
చేపల్లలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నశింపజేయడంలో దోహదపడతాయి. చేపలు తీసుకోని వారు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ను తీసుకోవడం మంచిది. అలాగే క్రాన్బెర్రీస్, బ్లూబెర్రీస్, బచ్చలికూర, బ్రోకొలీ వంటి వాటిని తీసుకోవాలి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్పెక్షన్ ను తగ్గించడంలో దోహదపడతాయి. ఈ విధంగా నీటిని ఎక్కువగా తీసుకుంటూ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా యుటిఐ ల బారి నుండి బయటపడడంతో పాటు ఇటువంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇటువంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే వ్యకిగత పరిశుభ్రత కూడా చాలా అవసరమని వారు చెబుతున్నారు.