Cough : ఇది అసలే వర్షాకాలం. ఈ సీజన్‌లో మనపై దాడి చేసేందుకు అనేక సూక్ష్మ క్రిములు సిద్ధంగా ఉంటాయి. పైగా దోమలు. దీంతో జ్వరాలు కూడా వస్తుంటాయి. ఇక ఈ సీజన్‌లో మనల్ని బాగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో దగ్గు కూడా ఒకటి. దగ్గు వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. దీంతో చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను తెచ్చి వాడుతుంటారు. ఇలా ఈ మెడిసిన్‌ను ఎల్లప్పుడూ వాడడం అంత క్షేమకరం కాదు. కనుక సహజసిద్ధమైన చిట్కాలతోనే మనం దగ్గును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దగ్గు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటే.. కాస్త తేనె, పసుపును మిశ్రమంగా తయారు చేసుకొండి. ఆ మిశ్రమాన్ని తీసుకోండి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనంతోపాటు తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు దగ్గుకు కారణమయ్యే క్రిములను చంపేస్తాయి. దీంతో దగ్గు నుంచి త్వరగా కోలుకోవచ్చు. అలాగే కాస్త అల్లం పొడి, తేనె మిశ్రమాన్ని కూడా తీసుకోవచ్చు. దీన్ని రోజుకు 3 పూటలా తీసుకోవాలి. దీంతో దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
అల్లం టీ తాగినా దగ్గు తగ్గుతుంది. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి నీటిలో వేసి ఆ నీటిని బాగా మరిగించండి. మరిగిన నీటిని వడబోసి రోజుకు రెండు మూడు సార్లు తాగండి. దీంతో శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. కఫం తగ్గుతుంది. దగ్గు నుంచి బయట పడవచ్చు. అలాగే పాలు తాగే అలవాటు ఉన్నవాళ్లు.. గోరు వెచ్చని పాలలో కొంచెం మిరియాల పొడి వేసుకొని రాత్రి పూట తాగితే దగ్గు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇలా సహజసిద్ధమైన పదార్థాలతోనే మనం దగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.