భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే నెయ్యిని ఉపయోగిస్తున్నారు. నెయ్యిలో మనకు రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఆవు నెయ్యి కాగా రెండోది గేదె నెయ్యి. అయితే ఏ నెయ్యిని వాడినా సరే కల్తీ జరగని స్వచ్ఛమైన నెయ్యిని వాడాల్సి ఉంటుంది. కల్తీ జరిగిన నెయ్యిని వాడితే మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం పాడవుతుంది. అసలే కల్తీమయంగా ఉన్న ప్రస్తుత తరుణంలో స్వచ్ఛమైన నెయ్యిని గుర్తించడం చాలా కష్టంగా మారింది. అయితే కింద చెప్పిన పలు సూచనలు పాటిస్తే దాంతో స్వచ్ఛమైన, కల్తీ అయిన నెయ్యిని మనం సులభంగా గుర్తించవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాస్త నెయ్యిని తీసుకుని మీ అరచేతిలో వేసుకుని చేతిని కిందకు వంచండి. నెయ్యి కిందకు జారితే అది స్వచ్ఛమైందని అర్థం. అలా కాకుండా నెయ్యి వేసిన చోటే ఉంటే అది కల్తీ అయిందని గుర్తుంచుకోవాలి. అలాంటి నెయ్యిని ఉపయోగించకూడదు. అలాగే నెయ్యిని కాస్త తీసుకుని నీటిలో వేసి కలపాలి. అది పూర్తిగా నీటిలో కరిగి కలిసిపోతే స్వచ్ఛమైందని, లేకపోతే కల్తీ అయిందని భావించాలి.
స్వచ్ఛమైన నెయ్యిలో మనకు అణువుల మాదిరిగా కనిపిస్తాయి. కానీ కల్తీ అయిన నెయ్యి మెత్తని పేస్ట్‌లా ఉంటుంది. ఇక నెయ్యిని కాస్త పెనంపై వేసి మరిగిస్తే ఎంతో సువాసన వస్తుంది. అలాంటి నెయ్యి స్వచ్ఛమైందని భావించాలి. కల్తీ అయిన నెయ్యి సువాసన రాదు. అలాగే స్వచ్ఛమైన నెయ్యిని పెనంపై వేసి మరిగిస్తే త్వరగా కరుగుతుంది. కానీ కల్తీ అయిన నెయ్యి అంత త్వరగా కరగదు. అలాగే కరగబెట్టిన నెయ్యిలో కాస్త చక్కెర వేసి బాగా కలపాలి. 5 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత అడుగు భాగంలో ఎర్రని పొర కనిపిస్తే అప్పుడు ఆ నెయ్యి కల్తీ అయిందని, అందులో వెజిటబుల్ ఆయిల్‌ను కలిపారని గుర్తించాలి. ఇలా మనం కొనే నెయ్యి స్వచ్ఛమైనదా, కాదా.. అనే విషయాన్ని మనం సులభంగా గుర్తించవచ్చు.