Plastic Utensils : ప్రస్తుతం ప్లాస్టిక్ అన్నది మన నిత్య జీవితంలో భాగం అయిపోయింది. మన ఇళ్లలో అనేక రకాల ప్లాస్టిక్ వస్తువులను మనం ఉపయోగిస్తున్నాం. అయితే కొన్ని వస్తువులను మాత్రం మనం రెగ్యులర్‌గా వాడుతూనే ఉంటాం. వాటిని కడిగి మరీ మళ్లీ మళ్లీ ఉపయోగిస్తాం. అయితే ప్లాస్టిక్ వస్తువులు లేదా పాత్రలపై కొన్ని సార్లు మరకలు పడుతుంటాయి. అలాంటప్పుడు వాటిని పోగొట్టడం చాలా కష్టంగా మారుతుంది. అయితే కింద చెప్పిన కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు, దాంతో మీ ప్లాస్టిక్ పాత్రలపై ఏర్పడిన మరకలను చాలా సులభంగా తొలగించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు మీ ఇంట్లో తరచూ వాడే హ్యాండ్ శానిటైజర్ సహాయంతో మీ ఇంట్లోని ప్లాస్టిక్ పాత్రలను శుభ్రం చేయవచ్చు. దీంతో మరకలు సులభంగా పోతాయి. అందుకు ఏం చేయాలంటే శానిటైర్‌ను పాత్రకు రాసిన తరువాత 1 గంట సేపు ఆగాలి. అనంతరం తడి వస్త్రంతో శుభ్రంగా తుడవాలి. తరువాత గోరు వెచ్చని నీరు, సబ్బుతో శుభ్రం చేయాలి. దీంతో ప్లాస్టిక్ పాత్రలపై ఏర్పడిన మరకలు సులభంగా వదిలిపోతాయి. అయితే శానిటైజర్‌లో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ. కనుక మీ ప్లాస్టిక్ పాత్రలు కలర్ చేంజ్ అయ్యే చాన్స్ ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఆల్కహాల్‌ను పూర్తిగా తుడిచే ప్రయత్నం చేయండి. లేదంటే అవి కలర్ మారిపోతాయి.
ఉప్పు, నిమ్మరసం..
ప్లాస్టిక్ పాత్రలకు అంటుకున్న మరకలను తొలగించడంలో ఉప్పు, నిమ్మరసం కూడా ఎంతగానో పనిచేస్తాయి. పాత్రలకు ఉన్న మరకలపై ముందుగా ఉప్పు రాసి స్క్రబర్ సహాయంతో బాగా రుద్దాలి. తరువాత మరకలపై నిమ్మరసం రాయాలి. 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. అనంతరం కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ పాత్రలపై ఉండే మరకలు సులభంగా తొలగిపోతాయి. నిమ్మరసం సహజసిద్ధమైన బ్లీచ్‌లా పనిచేస్తుంది. కనుకనే మరకలను తొలగిస్తుంది.
అలాగే మార్కెట్‌లో లభించే క్లోరిన్ బ్లీచ్‌ను వాడినా కూడా ప్లాస్టిక్ పాత్రలు, వస్తువులపై ఉండే మరకలు పోతాయి. అయితే బ్లీచ్ బాగా కఠినంగా ఉంటుంది కనుక దీన్ని వాడే సమయంలో చేతులకు గ్లోవ్స్ వేసుకుంటే మంచిది. ఇలా ఈ చిట్కాలను పాటించడం వల్ల మీ ప్లాస్టిక్ వస్తువులు లేదా పాత్రలపై ఏర్పడిన మరకలను సులభంగా తొలగించుకోవచ్చు. అవి మళ్లీ తళతళా మెరుస్తాయి. కాబట్టి ఈ చిట్కాలను పాటించడం మరిచిపోకండి.