రోడ్లపై కుక్కలు వెంట పడితే ఎవరైనా ఏం చేస్తారు..? పరుగు లంకించుకుంటారు. వాటి నుంచి వీలైనంత త్వరగా దూరంగా పారిపోవాలని చూస్తారు. అదే ఎవరైనా చేసేది. కానీ… ఎవరూ వాటిని ఎదిరించి అలాగే నిలబడి సాహసం చేయరు. అయితే వాస్తవంగా చెప్పాలంటే… కుక్కలు వెంట పడితే పారిపోవాల్సిన పనిలేదు. మరి అవి కరిస్తే ఎలా..? అంటారా..! అంత దాకా రానిస్తామా ఏంటీ..! అప్పటికే వాటి దిశ మార్చేయాలి. మన వైపు పడకుండా చూసుకోవాలి. దీంతో వాటి నుంచి సేఫ్‌గా తప్పించుకోవచ్చు. మరి… అలా తప్పించుకోవాలంటే… కుక్కలు వెంటపడినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…
కుక్కలు వెంట పడగానే చాలా మంది చేసే పనే ఇది. బాగా భయపడతారు. ఎక్కడ కరుస్తుందోనని దూరంగా పారిపోతారు. అయితే ముందు ఆ భయం వీడాలి. మీరెంత భయం చెందితే కుక్కలు అంత ఎక్కువగా భయపెట్టి మీ మీదకు వచ్చేందుకు చూస్తాయి. కనుక అస్సలు భయపడకూడదు. ధైర్యంగా ఉండాలి. ఏమాత్రం మీరు భయపడుతున్నారని అవి పసిగట్టినా ఇక అంతే సంగతులు. ఆ తరువాత మీరేం చేసినా ప్రయోజనం ఉండదు. కుక్కలు వెంటపడగానే చాలా మంది పొలోమని పరిగెత్తుతారు. కానీ అలా చేయకూడదు. వాటికి ఎదురుగా నిలబడి అలాగే ఉండాలి. అస్సలు కదలకూడదు. ఇలా చేస్తే అవి మన పట్ల ఇంట్రస్ట్ లేక వెంటనే మన నుంచి దూరంగా పోతాయట. అయితే అలాంటి సమయంలో వీలైతే మామూలుగా నడవచ్చు. కానీ పరిగెత్తకూడదు.
కుక్క కళ్లలోకి కళ్లు పెట్టి చూడకూడదు. అలా చేస్తే అవి ఇంకా మీదకు వచ్చేందుకు చూస్తాయి. మనల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తాయి. కనుక ఆ ప్రయత్నం మానేయాలి. కుక్క వెంట పడగానే పైన చెప్పినవి చేయాలి. ఈ క్రమంలో దాని దిశ మార్చేందుకు కూడా యత్నించాలి. అది ఎలాగంటే మీ దగ్గర ఉన్న, లేదా మీకు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక వస్తువును దానికి చూపిస్తూ దూరంగా విసిరేయాలి. దీంతో ఆ వస్తువును పట్టుకునేందుకు ఆ కుక్క వెళ్తుంది. అప్పుడు మీరు తప్పించుకోవచ్చు. కుక్కలు వెంట పడితే మరీ పెద్దదిగా, చిన్నదిగా కానీ వాయిస్‌తో వాటిని పొమ్మని గట్టిగా అరవాలి. ఇలా చేస్తే ఆ అరుపును అవి గ్రహించి తోక ముడుస్తాయి.