బంగారం విలువ రోజు రోజుకీ ఎలా పెరిగిపోతుందో అందరికీ తెలిసిందే. కనుకనే చాలా మంది తాము సంపాదించే డబ్బును బంగారంపై పెట్టుబడిగా పెడుతున్నారు. లాభాలను గడిస్తున్నారు. ఇక శుభ కార్యాల సమయంలో బంగారం కొనడం సరేసరి. దీంతో భారతీయులు ఏటా బంగారాన్ని విపరీతంగా కొనాల్సి వస్తోంది. ఫలితంగా బంగారం ధరలు నానాటికీ ఆకాశం వైపు పరుగులు పెడుతూనే ఉన్నాయి. అయితే డబ్బు పొదుపు చేసుకునే వారు అనేక రకాలుగా పొదుపు చేయవచ్చు. వాటిల్లో బంగారంపై పెట్టే పెట్టుబడి కూడా ఒకటి.
మన దగ్గర డబ్బు ఉంటే దాన్ని బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తాం. లేదా కొందరు రికరింగ్ డిపాజిట్ చేస్తారు. ఇంకొందరు వివిధ రకాల ప్రభుత్వ పథకాలు లేదా పోస్టాఫీస్ స్కీముల్లోనూ డబ్బును పొదుపు చేస్తారు. కొందరు షేర్లను కొంటే కొందరు మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడతారు. ఇక బంగారంపై పెట్టుబడి కూడా పెడతారు. ఇది మూడు రకాలుగా ఉంటుందని చెప్పవచ్చు. బంగారాన్ని మనం ఫిజికల్‌గా కొనుగోలు చేయవచ్చు. లేదా ఆర్‌బీఐ విక్రయించే గోల్డ్ బాండ్స్‌ను పత్రాల రూపంలో కొనవచ్చు. లేదా డిజిటల్ గోల్డ్‌ను కూడా కొనవచ్చు. ఇక వీటి గురించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారాన్ని ఇలా కొనవచ్చు..
మీరు బంగారాన్ని భౌతికంగా కొనదలుచుకోకపోతే పత్రాలు లేదా డిజిటల్ రూపంలో కొనవచ్చు. ఎలా కొన్నప్పటికీ బంగారం రేటు పెరుగుతుంది కనుక బంగారంపై డబ్బును పెట్టుబడిగా పెడితే భవిష్యత్తులో కచ్చితంగా లాభాలు వస్తాయని చెప్పవచ్చు. ఇక బంగారాన్ని పత్రాల రూపంలో కొనాలంటే అందుకు గాను ఆర్‌బీఐ ఏటా సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను విక్రయిస్తుంది. అలా మీరు బంగారాన్ని పత్రాల రూపంలో కొనవచ్చు.
ఇక మీరు బంగారాన్ని భౌతికంగా కొనవచ్చు. అంటే బంగారు ఆభరణాలు, గోల్డ్ బార్స్, కాయిన్స్ రూపంలో బంగారాన్ని కొనవచ్చు. లేదా డిజిటల్ రూపంలోనూ బంగారాన్ని కొనవచ్చు. చాలా వరకు ఆర్థిక సంస్థలు ఇలా బంగారాన్ని డిజిటల్ రూపంలో కొనేలా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. డిజిటల్ బంగారాన్ని కొనడం చాలా తేలిక. దీనికి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఉంటుంది. భౌతికంగా బంగారం ఉంటే దాన్ని మనం సెక్యూర్డ్‌గా ఉంచుకోవాల్సి వస్తుంది. కానీ డిజిటల్ గోల్డ్‌కు ఆ భయం ఉండదు. మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ వద్ద అది ఉంటుంది. దాన్ని ఆర్‌బీఐ పర్యవేక్షిస్తుంది. కనుక మనం డిజిటల్ గోల్డ్‌ను నిర్భయంగా కొనవచ్చు.
డిజిటల్ గోల్డ్ కొనడం ఇలా..
ఇక చాలా వరకు సంస్థలు ఒక గ్రామ్ బంగారాన్ని కొనే వెసులు బాటును కల్పిస్తున్నాయి. లేదంటే మీరు మీ దగ్గర ఉన్న డబ్బుకు సమానమైన బంగారాన్ని కొనవచ్చు. మీ దగ్గర ఎంత తక్కువ మొత్తం డబ్బు ఉన్నా సరే.. అంటే కనీసం రూ.500 ఉన్నా సరే ఎంతో కొంత బంగారాన్ని డిజిటల్ రూపంలో కొనవచ్చు. ఇలా వరకు కంపెనీలు ఆఫర్లను అందిస్తున్నాయి. ఇక ఆర్‌బీఐ విక్రయించే బాండ్స్‌ను కొంటే నిర్ణీత సమయం ఉంటుంది. ఆ సమయం తరువాత మనం వాటిని విక్రయించి డబ్బును పొందవచ్చు. లేదా అందుకు సమానమైన భౌతిక రూపంలోని బంగారం పొందవచ్చు. ఇక బంగారాన్ని భౌతికంగా కాయిన్స్, ఆభరణాలు లేదా బార్స్ రూపంలో కొంటే సెక్యూరిటీ సమస్య ఉంటుంది. దాన్ని మన ఇంట్లో జాగ్రత్తగా కాపాడాలి.
కనుక బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారు సెక్యూరిటీ పరంగా చూస్తే బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్ రూపంలో బంగారాన్ని కొనవచ్చు. నెల నెలా డిజిటల్ గోల్డ్‌ను కొంత కొంటుంటే మీ పిల్లలు పెద్దయ్యాక వారికే ఆ బంగారం అవసరం అవుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఇలా బంగారాన్ని డిజిటల్ రూపంలో కొంటే ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ఆ బంగారం వారి పెళ్లికి ఉపయోగపడుతుంది. కనుక డిజిటల్ గోల్డ్‌ను చాలా మంది కొంటున్నారు. కాబట్టి మీకు కూడా ఆసక్తి ఉంటే ఈ విధానంలో మీరు డబ్బును బంగారంపై పెట్టుబడిగా పెట్టవచ్చు. దీంతో ఎంతో లాభం ఉంటుంది.