ఈ రోజుల్లో ప్రతి చోట మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను గుర్తించడం ఎలా? వీటి నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటివి తెలుసుకోవడం మంచిది. పెట్రోల్ బంక్‌కు వెళ్లాక మీటర్ గమనిస్తే రీడింగ్ (0) సున్నా చేస్తారు. అది మనకు కనిపిస్తుంది. పెట్రోల్ నింపడం ప్రారంభించగానే.. అంతా బాగానే ఉంది అని వినియోగదారులు లైట్ తీసుకుంటారు. అప్పుడే మోసాలకు పాల్పడతారని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్ కొట్టడం ప్రారంభించగానే 1,2,3 రీడింగ్ కనిపించకుండా నేరుగా 5,6,7,8 కు జంప్ అవుతుందట. ఇలా చేయడం వల్ల మీకు రావాల్సిన పెట్రోల్ కన్నా తక్కువగా వస్తుందని అంటున్నారు. అందుకే జాగ్రత్తగా రీడింగ్ గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కార్లలో ప్యూయల్ ఫిల్ చేసుకునే చాలా మంది వాహనం కిందకు దిగరు. లోపల నుంచి డబ్బులు చెల్లించి కొట్టించుకుంటారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని మీటర్ రీడింగ్ మార్చకుండానే ఫిల్ చేస్తుంటారని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎప్పుడు పెట్రోల్ కొట్టించినా కారు దిగి మీటర్ దగ్గరు వెళ్లి పోయించుకోవాలని సూచిస్తున్నారు.ఇంధనం ధర ఎక్కువగా ఉంటుంది. అలాగే బంకులలో అనేక మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి వాహన చోదకులు, కార్ల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి. పెట్రోల్ పోసే వ్యక్తి మెషీన్‌ను తరచుగా నిలిపివేస్తుంటే మోసం చేస్తున్నట్లుగానే భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పెట్రోల్ తక్కువగా వస్తుందని అంటున్నారు. ఇలా అనుమానం వచ్చిన సమయంలో అవసరమైతే పెట్రోల్‌ను పరీక్షించమని బంక్ యజమానులను డిమాండ్ చేయాలని సూచిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో పాత మెషీన్లనే వినియోగిస్తుంటారు. ఇలా పాత మెషీన్లు ఉన్న బంకుల్లో జాగ్రత్తగా ఉండాలని.. వీటిలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే డిజిటల్ మీటర్లు ఉన్న పెట్రోల్ బంకుల్లో కొట్టించుకోవడం ఉత్తమం.ఇంకా చాలా మంది పెట్రోల్ బంక్ అటెండెట్స్ ట్యాంక్ నుంచి త్వరగా నాజిల్‌ను బయటకు తీస్తుంటారు. ఇలాంటి సమయంలో అనుమానం వ్యక్తం చేయాలని నిపుణులు చెబుతున్నారు. మెషీన్, మీటర్ పూర్తిగా ఆగిన తర్వాతనే ట్యాంక్ నుంచి నాజిల్ బయటకు తీయాలని వారికి ముందుగానే చెప్పాలని సూచిస్తున్నారు. కొన్నిసార్లు కల్తీ పెట్రోల్ కూడా పోస్తుంటారు. ఒకవేళ పెట్రోల్ కల్తీ అయినట్లు అనుమానం వస్తే వెంటనే లిట్మస్ పేపర్‌తో పరీక్షించాలని సూచిస్తున్నారు.