మరీ లోపలికి వెళ్లకుండా టూకీగా నా సమాధానం చెప్తాను. కొంచెం కష్టమైన ప్రశ్న. ప్రశ్నలో ఖాళీలు ఉన్నాయి. ప్లాటా (Plot) లేక ఫ్లాటా (Flat)? ఈ రెండింటికి తేడా మీకు బాగా తెలుసు. మొదటిది ఒక భూభాగం. రెండవది ఒక నివాసభవనంలో భాగం- అపార్ట్ మెంట్. గ్రామం లో లాండ్ – దీనికి రెండు అర్థాలు వస్తాయి ఒకటి పొలం, ఇంకోటి ఇల్లు కట్టుకునేందుకు స్థలం. చాలా విషయాలు ఊహించుకుని రాయడం సరి కాదు. ఎందుకంటే మీరు ఆశించిన సమాధానం రాకపోవచ్చు. మీ ఆలోచన ఒకలా ఉండొచ్చు, నా సమాధానం ఇంకోలా ఉండొచ్చు. అందువల్ల ఉన్న ఐచ్చికాలను తీసుకుని సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను.
నేను వ్యవసాయదారుణ్ణి కాదు, గాని వ్యవసాయం గురించి కొంత అవగాహన ఉంది,పూర్తిగా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం అంత లాభసాటిగా ఉన్నట్టుగా లేదు. అందువల్ల పొలం అనేది పక్కన పెడదాం. (నా ఈ భావన తప్పేమో అని కూడా నాకు భయంకర అనుమానం.) ఇప్పుడు ఐఛ్ఛికాలు -గ్రామంలో స్థలం లేదా నగరం, మహానగరం లో స్థలం. దీనికి నా సమాధానం ఒకటే. స్థలం అయినట్టయితే పట్టణ, నగర ప్రాంతాల్లోనే సరి అయినది. పెట్టుబడి మీద మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది అనుమానం లేకుండా. కానీ కబ్జాదారుల నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక గ్రామంలో లేదా నగరాల్లో ఇల్లు. ఇది మీ వ్యక్తిగత అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి అపార్ట్మెంట్ ఇష్టం ఉండదు, నివసించడానికి/ అద్దె వస్తున్నప్పటికీ….అద్దె కున్న వారి బాధలు వింటూ ఉండాలి, కనీసం ఐదు ఆరేళ్లకు ఒకసారి మెయింటెయిన్ చేయడానికి ఖర్చు చేస్తూ ఉండాలి. వగైరా…వగైరా.
నేను నా చిన్నతనంలో గ్రామ జీవనాన్ని ఎంతో ఆస్వాదిం చాను. అందువలన మీకు ఏది ఇష్టమైతే అది చేస్తారు; అంతే కదా. అలా కాకుండా పెట్టుబడి మీద రాబడిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ప్రశ్న వేసినట్లయితే ఇది కూడా పట్టణాల్లోనే సరైనది అని నా అభిప్రాయం. డబ్బులు ఉంటే, పట్టణ, మహానగరాల్లో ఒక స్థలం కొని అందులో సొంత ఇల్లు కట్టుకోవడం అనేది బెమ్మాండం… అయితే ఇదే డబ్బులకి ఒక పల్లెటూర్లో మహారాజ ప్రాసాదం లాంటి ఇల్లు కట్టేయొచ్చు. అది ఇంకా బెమ్మాండం.. బెమ్మాండం. నేను బ్యాంకులో చేరిన దగ్గర నుంచి ఎక్కువ నగరాలు, మహానగరాల్లో పనిచేయాల్సి వచ్చింది. ఇప్పుడు బోర్ కొట్టింది కూడా. మా రాజమండ్రి దగ్గర ఏదైనా మంచి పల్లెటూరులో, ఒక పొలంలో చిన్న పాక వేసుకుని అందులో ఉండాలన్న కోరికైతే ఉంది. నవ్వకండి.. నిజంగా న్నిఝం…
దూరపు కొండలు నునుపు అంటారా? అయితే నాకు దూరపుకొండలు కాదు; చిన్నతనంలో నాకుపల్లెటూరు జీవనం అనుభవం ఉంది. అది బాగుంటుంది. పల్లెటూర్లు రాజకీయంగా కలుషితమై ఉండవచ్చును గాని భౌతికంగా అక్కడ ఇప్పటికీ స్వచ్ఛమైన గాలి, నీరు లభిస్తున్నాయని నేను ఘాఠ్ఠిగా నమ్ముతున్నాను. ధన్యవాదాలు.