ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక చోట్ల ED (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అనేక చోట్ల కోటానుకోట్ల నల్లధనం బయట పడుతోంది. నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా లభిస్తున్నాయి. చాలా మంది మోసం చేసి లేదా నేరాలు చేసి నల్లధనాన్ని వెనకేస్తున్నారు. అలాంటి డబ్బు మొత్తం ED దాడుల్లో పట్టుబడుతోంది. అయితే ఇప్పటి వరకు ED దాడుల్లో లభించిన మొత్తం రూ.1 లక్ష కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇలా దాడుల్లో పట్టుబడిన నల్లధనం లేదా బంగారం వంటి వాటిని ఏం చేస్తారు ? అనే ప్రశ్న చాలా మందికి ఉత్పన్నం అవుతుంటుంది. అయితే అలాంటి డబ్బును లేదా విలువైన వస్తువులను ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో ఎక్కడైనా సరే మనీ లాండరింగ్ లేదా నల్లధనం దాచి ఉంచారని, నేరం చేశారని, అక్రమంగా ధనం, విలువైన వస్తువులను కలిగి ఉన్నారని సమాచారం అందితే.. ఈడీ లేదా సీబీఐ లేదా ఐటీ శాఖ అధికారులు దాడులు చేయవచ్చు. ఇక ఆ దాడుల్లో పట్టుబడిన డబ్బును లేదా ఆభరణాల వంటి విలువైన వస్తువులను సీజ్ చేస్తారు. ఆ డబ్బు, వస్తువులు అన్నీ సంబంధిత శాఖ ఆధీనంలో ఉంటాయి. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఆ వివరాలను కోర్టులో అందజేస్తారు.
అయితే కేసు విచారణ జరిగి నిందితులు దోషులు అని తేలితే.. వారి నుంచి అంతకు ముందు స్వాధీనం చేసుకున్న నల్లధనం లేదా విలువైన వస్తువులను ఏవి ఉన్నా సరే వాటిని చట్ట ప్రకారం.. కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తారు. అప్పుడు కేంద్రం వాటిని సంక్షేమ పథకాలకు లేదా అభివృద్ధి కోసం వాడుతుంది. ఇక దోషులు ఒక వేళ బ్యాంకు మోసానికి పాల్పడి ఉంటే.. వారు బ్యాంకులకు ఏమైనా బకాయి ఉంటే.. అప్పుడు అలా స్వాధీనం చేసుకున్న సొమ్ము లేదా వస్తువులను బ్యాంకులకు అప్పు కింద జమ చేస్తారు. దీంతో బ్యాంకులకు అప్పులు తీర్చినట్లు అవుతుంది.
అయితే ఒక వేళ అధికారులు పెట్టిన కేసులు నిలబడక నిందితులు నిర్దోషులు అని తేలితే మాత్రం అధికారులు తమ అటాచ్‌మెంట్‌లో లేదా ఆధీనంలో ఉంచుకున్న ధనం, వస్తువులు అన్నింటినీ మళ్లీ వెనక్కి ఇచ్చేయాలి. ఇలా ఈ వ్యవస్థ కొనసాగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈడీ దాడుల్లో భారీ మొత్తంలో నల్లధనం బయట పడుతుండడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.