SBI నీ HDFC నీ పోల్చడం అంటే మారుతీ సుజుకీ షోరూమ్ నీ ఫెరారీ షోరూమ్ నీ పోల్చడమే. నా పోలిక బ్యాంకింగ్ క్వాలిటీ గురించి కాదు, వినియోగదారుల గురించి. రోజూ కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిపే వ్యాపారస్థుల బ్యాంకింగ్ అవసరాలూ, నెల నెలా వచ్చే పింఛను కోసం ఎదురు చూసే వారి బ్యాంకింగ్ అవసరాలూ వేరు వేరు. HDFC లో పింఛను డబ్బుల కోసం ఎవరూ ఖాతా తెరవరు. ఎందుకంటే పింఛను కంటే అకౌంట్ లో ఉండాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ ఎక్కువ. అదీ కాక వారిలో చాలామంది డిజిటల్ బ్యాంకింగ్ పరిజ్ఞానం లేని వాళ్ళే. కాబట్టి వారు ప్రతీ అవసరానికీ బ్యాంకుకే వెళతారు. HDFC వినియోగదారులు దాదాపు ఎక్కువ జీతాలు వచ్చే వాళ్లూ, ధనిక వ్యాపారస్థులే. వారు బ్యాంకుకు వెళ్లడం కంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నే అన్ని అవసరాలూ తీర్చుకుంటారు, అలాంటి సేవలను అందించే బ్యాంకునే ఎంచుకుంటారు.
వారి వినియోగదారులు అదే కోరుకుంటారు కాబట్టి HDFC ఆన్లైన్ సేవల మీద ఎంతైనా ఖర్చు చేసి వారి App ని నిర్మించడమే కాక ఏదైనా అరుదైన అవసరాల కోసం వారి ప్రతినిధితో మాటలాడవలసి వస్తే ఫోన్ లో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఎక్కువమంది కస్టమర్ కేర్ సేవకులని పెట్టుకుంటారు. ప్రతీ చిన్న పనికీ బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కాబట్టి బ్యాంకుల్లో రద్దీ తక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం పెద్దగా గమనించని ఇంకో కారణం ఉంది. ఏమిటంటే Consumer Base. HDFC కస్టమర్లు మూడు కోట్ల కంటే తక్కువే. 2023 లెక్కల ప్రకారం 2.5 కోట్లు. కానీ SBI కస్టమర్లు దాదాపు యాభై కోట్లు. విడివిడిగా చూస్తే అది 165 దేశాల జనాభా కంటే ఎక్కువ.
HDFC కంటే ఇరవై రెట్లు ఎక్కువ. దానికి తగినట్టు బ్రాంచుల సంఖ్య ఎక్కువ ఉన్నా కూడా రద్దీ ఎక్కువగా ఉండడం చాలా సహజం. ఇంకా చెప్పాలంటే అంతమందికి సేవలను అందిస్తూ కూడా బ్రాంచుకి వెళ్ళినప్పుడు మన పనులు జరుగుతున్నాయంటే సమర్థవంతంగా పని చేస్తున్నారనే చెప్పాలి. ఇక్కడ ఇంకో విషయం ఉంది. టైప్ ఆఫ్ సర్వీస్- అంటే రెండూ బ్యాంకులే అయినా SBI, HDFC లు అందించే సేవల్లో చాలా భేదాలున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు చాలా వరకూ HDFC ద్వారా లభించవు. SBI లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారానే లభిస్తాయి. ఆ పథకాలకి అర్హులైన వారు వాటిని పొందాలంటే తప్పనిసరిగా బ్యాంకుకి వెళ్లి అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. అర్హులైన వారికి మాత్రమే అందేలా, వారి పేరుతో ఇతరులు వారి డబ్బులు కాజేయకుండా ఆ పథకాలను అలా డిజైన్ చేస్తారు. కాబట్టి కోట్లలో ఉన్న అర్హులందరూ బ్యాంకుకి వెళ్తూ ఉండడం తప్పనిసరి.
మనం ఎప్పుడూ గమనించని ఇంకో అంశం ఏమిటంటే SBI లో రోజూ కొన్ని వందల కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. వాళ్ళు హ్యాండిల్ చేసే డబ్బు చాలా దేశాల GDP కంటే ఎక్కువ. SBI దగ్గర ఉన్న డబ్బు చాలా దేశాల రిజర్వ్ బ్యాంకుల కన్నా ఎక్కువ. అసలైన గణాంకాలు నా దగ్గర లేవు కానీ అంత పెద్ద బ్యాంకు మీద ప్రతీ నిమిషమూ కొన్ని వందల సైబర్ దాడులు జరుగుతూ ఉంటాయని మాత్రం చెప్పగలను. వాటిలో మోసపోయేది చిన్న చిన్న వినియోగదారులే. వాటన్నిటినీ తట్టుకుంటూ కొన్ని కోట్ల మంది దినసరి వేతనం మీద బ్రతికే వాళ్ళని రక్షించాలంటే కొన్ని రకాల సేవలను కేవలం బ్యాంకు బ్రాంచు ద్వారా మాత్రమే అందేలా చూడ్డం తప్పనిసరి. అందుకే కొన్ని కొన్ని సార్లు మనం YONO ద్వారా అయ్యే పనికి కూడా ఎందుకు బ్రాంచుకి రమ్మంటున్నారని తిట్టుకుంటూ ఉంటాము. తప్పనిసరి పరిస్థితుల్లో బ్రాంచుకి వెళ్లి ఆ రద్దీ లో మనమూ ఒకరౌతాము.
మరో విషయం ఏమిటంటే సియాచెన్ లాంటి తీవ్ర స్థాయి వాతావరణంలోనూ, థార్ ఎడారుల్లో ఉన్న చిన్న పట్టణాల్లోనూ, నిరంతరం తిరుగుబాటుదారుల ప్రమాదం పొంచి ఉన్న ఈశాన్య భారతందేశంలోనూ బ్యాంకు సేవలందించాలంటే వారికి ఒక మొబైల్ యాప్ ఇచ్చేసి మీరే చూసుకోండి అంటే సరిపోదు. అలాంటి సందర్భాల్లో ఆఫ్లైన్ సేవలు మాత్రమే సాధ్యం. కాబట్టి ఎస్బీఐ ఉద్యోగులకి ఆ వింటేజ్ బ్యాంకింగ్ ఎకో సిస్టమ్ అలవాటు అయి ఉండాలి. అందుకే SBI ఆఫ్ లైన్ సేవలని అందిస్తూనే ఉంటుంది. ఎస్బీఐ ని మోసేస్తున్నా అనుకోకండి. ఎస్బీఐ లో నాకు నచ్చని విషయాలు కూడా ఉన్నాయి. మచ్చుకొకటి SBI లో సింగిల్ విండో. సింగల్ విండో అంటారే గానీ మూడు నాలుగు కౌంటర్లకు వెళ్ళకుండా మన పని జరగదు. ప్రతీ కౌంటర్ లో పెద్ద క్యూ ఉంటుంది. దానికీ ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని నాకు నేను సర్దిచెప్పుకుని ఫీడ్ బ్యాక్ పత్రంలో ఓ ఫిర్యాదు రాసేసి వెళ్తూ ఉంటాను.